టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు జస్‌ప్రీత్ బుమ్రా జాగ్రత్తగా బౌలింగ్ చేస్తున్నాడని ఆరోపించాడు. ఇది ఆసియాకప్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ప్రపంచకప్‌లో టీమిండియాకు తీరని నష్టం చేస్తుందని హెచ్చరించాడు. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా బౌలింగ్ చేయకుండా జట్టు అవసరాలకు తగ్గట్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. సూర్యకుమార్ సారథ్యంలో మాత్రం ఆరంభంలోనే మూడు ఓవర్లు బౌలింగ్ చేసి, ఒక్క ఓవర్‌ను చివర్లో వేస్తున్నాడని తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన గణంకాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
'రోహిత్ శర్మ కెప్టెన్సీలో బుమ్రా సాధారణంగా 1, 13, 17, 19 ఓవర్లలో బౌలింగ్ చేసేవాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మాత్రం బుమ్రా ఆరంభంలోనే మూడు ఓవర్ల స్పెల్ వేస్తున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు, వామప్ తర్వాత బౌలింగ్ చేసేందుకు బుమ్రా ఇష్టపడుతున్నాడు. మిగిలిన 14 ఓవర్లలో బుమ్రా కేవలం ఒక ఓవర్ మాత్రమే వేయడం బ్యాటర్లకు గొప్ప ఊరటనిస్తుంది. ప్రపంచకప్‌లో బలమైన జట్లతో ఇలా బౌలింగ్ చేయిస్తే భారత్‌కు నష్టం కలిగించవచ్చు.'అని కైఫ్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌కు బుమ్రా బదులిచ్చాడు. ఇది నిజం కాదని పేర్కొన్నాడు. 'ఇది సరికాదు.. ఏ మాత్రం సరికాదు'అని బుమ్రా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు కైఫ్ కూడా బదులిచ్చాడు. ఓ శ్రేయోభిలాషిగా తన పరిశీలనను స్వీకరించాలని కోరాడు. 'దయచేసి దీనిని ఒక శ్రేయోభిలాషి, అభిమాని ఇచ్చిన క్రికెట్ పరిశీలనగా స్వీకరించండి. మీరు భారత క్రికెట్‌కు గొప్ప మ్యాచ్ విన్నర్. భారత జెర్సీని ధరించి మైదానంలో దిగినప్పుడు ఎంత కష్టపడుతారో నాకు తెలుసు.'అని కైఫ్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా బుమ్రాపై కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతి త్వరలోనే బుమ్రా టెస్ట్‌లకు రిటైర్మెంట్ పలుకుతాడని చెప్పాడు. 'అప్‌కమింగ్ టెస్ట్ మ్యాచ్‌ల్లో బుమ్రా ఆడే అవకాశం కనిపించడం లేదు. అతను రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అతను ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. బౌలింగ్‌లో వేగం కూడా తగ్గింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అతని బౌలింగ్‌లో వేగం కనిపించలేదు. అతను ఒక స్వతంత్ర వ్యక్తి. తాను నూటికి నూరు శాతం బౌలింగ్ చేయలేకపోతున్నానని, దేశం కోసం గెలవలేకపోతున్నానని, వికెట్లు తీయలేకపోతున్నానని భావిస్తే.. ఆట నుంచి అతనే స్వయంగా తప్పుకుంటాడు. ఇది నా గట్ ఫీలింగ్'అని కైఫ్ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది.