
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల శ్రీలంకతో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవగా.. ఈ విజయాన్ని ప్రశంసిస్తూ కైఫ్ ట్వీట్ చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టెస్టు జట్టు అద్భుతాలు చేస్తోందని పేర్కొన్నాడు.
' కేఎల్, రోహిత్, విరాట్, అయ్యర్, పంత్, జడేజా, యాష్, బుమ్రా, షమీ.. తుది జట్టు కోసం చాలా ఆప్షన్లు.. ఆకస్మాత్తుగా చూస్తే అంతా బాగానే ఉంది. రోహిత్-ద్రవిడ్ నేతృత్వంలో అత్యుత్తమ టెస్టు జట్టుగా రూపాంతరం చెందుతోంది'' అని ట్వీట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి తీర్చి దిద్దిన జట్టును రోహిత్, ద్రవిడ్ నడిపిస్తున్నారని, వారి కష్టాన్ని ప్రస్తావించకపోవడం బాలేదని అభిమానులు మండిపడ్డారు.
రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ శ్రమను తక్కువగా చేయడం సరికాదని కామెంట్లు చేశారు. 'స్వదేశంలో కాదు.. అసలైన పరీక్ష విదేశీ పిచ్‌లపై ఉంటుంది.. అక్కడ నాయకత్వం నిరూపించుకోవాలి'అని రోహిత్ సారథ్యాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'బౌలింగ్ దళం పటిష్టంగా మారేందుకు గతంలోనే కోహ్లీ, రవిశాస్త్రి ఎంతో కృషి చేశారు' అని, 'ఇదే టీమ్ విరాట్ నాయకత్వంలోనూ అద్భుతంగా ఆడింది.
ఎన్నో విజయాలను నమోదు చేసింది. అయితే పుజారా/రహానెలను తప్పించలేకపోవడం, అశ్విన్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం తప్పితే విరాట్-రవిశాస్త్రి జట్టును బాగా తయారు చేశారు'' అని ఇంకొందరు కామెంట్ చేశారు. 'విరాట్-రవిశాస్త్రి టైమ్‌లోనే జట్టుకు ఓ రూపం వచ్చింది. ఇది కోహ్లీ టీమ్. ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్‌ను టాప్‌లోకి తీసుకొచ్చాడు' అని చురకలంటిస్తున్నారు.
సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి భారత జట్టును నడిపించాడు. ఇక రోహిత్ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన శ్రీలంకతో టీ20, టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఫస్ట్ సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు.