చెత్త అంపైరింగ్‌తోనే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మహమ్మద్ హఫీజ్ అన్నాడు. మహమ్మద్ రిజ్వాన్ విషయంలో అంపైర్లు చేసిన తప్పిదం, టెక్నాలజీ తమకు శాపంగా మారయని చెప్పాడు. మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం ముగిసిన ఈ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పమైంది. రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నంతవరకు పాకిస్థాన్ గెలిచేలా కనిపించింది. కానీ అతను అంపైరింగ్ తప్పిదంతో వెనుదిరగడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు.

అయితే అంపైర్ల తప్పుడు నిర్ణయం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామని మహమ్మద్ హఫీజ్ ఆరోపించాడు. ఐదు వికెట్లు చేతిలో ఉండి 98 పరుగులు చేయాల్సిన క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ ఔటవ్వడం తమ ఓటమిని శాసించిందన్నాడు.
'జట్టుగా మేం కొన్ని తప్పిదాలు చేశాం. అలాంటి వాటి గురించి తప్పకుండా చర్చించుకుంటాం. అదే సమయంలో చెత్త అంపైరింగ్, టెక్నాలజీ అంశాలు మాకు శాపంగా మారాయి. లేకపోతే ఫలితం మరోలా ఉండేది. రిజ్వాన్ ఔట్‌పై నేను అతనితో మాట్లాడాను. అతను చాలా నిజాయితీపరుడు. గ్లోవ్స్‌కు బంతి తాకినట్లు అనిపించలేదని చెప్పాడు.
అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలంటే దానికి తగిన ఆధారాలు కూడా ఉండాలి. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. ఆస్ట్రేలియా రివ్యూ కోరింది. కానీ రివ్యూలో ఔటని చెప్పడానికి కావాల్సిన సరైన ఆధారాలు కనిపించలేదు. అనుకూలమైన ఫలితాలు వచ్చినప్పుడు టెక్నాలజీకి మద్దతు ఇస్తాం. కానీ, సందేహాలు ఉన్నప్పుడు మాత్రం ఆలోచించాల్సిందే. ఇలాంటి తప్పిదాలు మ్యాచ్ ఫలితాలను శాసిస్తాయి.'అని హాఫీజ్ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా నిర్దేశించిన 317 పరుగుల లక్ష్యచేధనలో పాకిస్థాన్ 219 పరుగుల వద్ద మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కోల్పోయింది. అప్పటికే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని నిలకడగా ఆడుతున్నాడు. దాంతో పాకిస్థాన్ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ప్యాట్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో రిజ్వాన్ తడబడ్డాడు.
దాంతో ఆసీస్ ఆటగాళ్ల క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేశారు. బంతి రిజ్వాన్ గ్లోవ్స్‌కు తాకిందని భావించారు. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌటిచ్చాడు. దాంతో ఆసీస్ రివ్యూ తీసుకోగా..థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రివ్యూలను పరిశీలించి ఔట్‌గా తేల్చాడు. హాట్‌స్పాట్ టెక్నాలజీతో ఫలితం రాకపోవడంతో.. స్నికో మీటర్ సాయంతో బంతి రిజ్వాన్ రిస్ట్ బ్యాండ్‌ను తాకినట్లు గుర్తించాడు. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తప్పుబడుతోంది.