ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అమీర్ ఓ పనికిమాలినోడని, వార్తల్లో నిలవడం కోసం భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని కైఫ్ చేసిన వ్యాఖ్యలకు అతను దీటుగా బదులిచ్చాడు. సౌరవ్ గంగూలీ అండదండలతో మహమ్మద్ కైఫ్ భారత జట్టులో కొనసాగాడని, ఫీల్డింగ్ తప్ప అతనికేం రాదని ఘాటుగా విమర్శించాడు. అసలు కైఫ్ ఎంత క్రికెట్ ఆడాడో కూడా తనకు తెలియదన్నాడు. కైఫ్ కంటే తనకే టీ20 క్రికెట్‌లో ఎక్కువ అనుభవం ఉందని స్పష్టం చేశాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొదలైనప్పటి నుంచి మహమ్మద్ అమీర్ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ ఓ స్లాగర్ అని, అతని బ్యాటింగ్‌లో టెక్నిక్ లేదని విమర్శలు గుప్పించిన అమీర్.. భారత జట్టు సెమీఫైనల్ చేరకుండానే ఇంటి బాట పడుతుందని జోస్యం చెప్పాడు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కైఫ్ నెటిజన్లకు సూచించాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా వంటి పసికూన జట్టులో పాకిస్థాన్ ఓటమికి మహహ్మద్ అమీర్ కారణమని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వేసింది అమీర్ అని, వైడ్స్ ఎక్కువగా వేసాడని, కనీసం స్టంప్‌లైన్‌లో కూడా బంతిని వేయలేదని గుర్తు చేశాడు. కేవలం వార్తల్లో నిలవడం కోసం భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడని, మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. అతని వ్యాఖ్యలకు బదులిచ్చి దిగజారాల్సిన అవసరం లేదని కైఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఈ వ్యాఖ్యలకు అమీర్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా బదులిచ్చాడు. కైఫ్ గంగూలీ చాటు బిడ్డని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో కొనసాగించినందుకు గంగూలీకి కైఫ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎగతాళి చేశాడు. 'మహమ్మద్ కైఫ్ ఎంత క్రికెట్ ఆడాడో నాకు తెలియదు. అందుకే అతని గణాంకాలు చూశాను. అతను కేవలం 29 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ కేవలం 103. నేను 350కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడాను. నా గణాంకాలను మీరు చూడండి. భారత్ గురించి మాట్లాడి ప్రచారం పొందే అవసరం నాకు లేదు.
నేను నా బౌలింగ్ నైపుణ్యంతో జట్టులో చోటు దక్కించుకున్నాను. కానీ, కైఫ్ కేవలం ఫీల్డింగ్‌తోనే జట్టులో కొనసాగారని విన్నాను. అందుకు మీరు మీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (దాదా)కి ధన్యవాదాలు చెప్పాలి. ఒక క్రికెటర్‌గా ఉండి ఇలాంటి స్థాయి లేని విమర్శలు చేయడం మీకు తగదు.’ అని మహమ్మద్ అమీర్ ఘాటుగా బదులిచ్చాడు. అమీర్ వ్యాఖ్యలకు కైఫ్ కౌంటర్ ఇస్తాడా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మహమ్మద్ అమీర్ అంచనాలను తారు మారు చేస్తూ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
