టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ గాలిగాడు, గుడ్డిగా ఆడుతాడనే ఘాటు వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్.. మరోసారి అతనిపై విమర్శలు గుప్పించాడు. అభిషేక్ శర్మ ప్రతీ బంతి తన స్లాట్‌లో పడాలనుకుంటాడని, స్లాట్‌లో పడితేనే ఆడగలుగుతాడని తెలిపాడు. ఆఫ్ సైడ్ బంతులు వేస్తే ఆడలేడని, అదే అతని బలహీనత అని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అమెరికాతో తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్.. అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చినా డకౌట్‌గానే వెనుదిరిగాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ సున్నాకే ఔటయ్యాడు. దాంతో అభిషేక్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకోవడంతో పాటు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మపై నోరు పారేసుకుంటున్నారు.

తాజాగా ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ అమీర్.. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌ను పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్‌తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరి సమస్య ఒకటేనని, ఆఫ్ సైడ్ షాట్స్ ఆడలేరని తెలిపాడు.
'కొన్నేళ్ల క్రితం సైమ్ అయూబ్ పీఎస్ఎల్ ఆడటానికి వచ్చినప్పుడు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. అప్పుడే అతను కొత్తగా లీగ్‌లోరి రావడంతో 'నో-లుక్' షాట్లు ఎక్కువగా ఆడేవాడు. అతని షాట్లు ఎక్కువగా లెగ్ సైడ్ ఉండటం వల్ల ఎవరికీ అతని బలహీనత తెలియలేదు. కానీ అతనికి థర్డ్, ఫోర్ట్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేస్తే ఎలా ఆడాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో కూడా అతను ఆఫ్ సైడ్ షాట్ ఆడబోయే ఔట్ అయ్యాడు. తన ఆఫ్-సైడ్ ఆటను మెరుగుపరుచుకోకపోతే అతను ముందుకు సాగలేడు. పటిష్టమైన బౌలర్లు ఎప్పుడూ బ్యాటర్ల బలహీనతలను పరీక్షిస్తారు. బ్యాటర్లను ఇబ్బంది పెట్టేలా బంతులు వేస్తారు.
అభిషేక్ శర్మ బలహీనత కూడా ఇదే. అతను ప్రతి బంతి స్లాట్‌లో పడాలని, అప్పుడే సిక్సర్లు కొట్టాలని కోరుకుంటాడు. కానీ అంతర్జాతీయ వేదికల్లో ప్రతీ బంతిని బాదలేం. సల్మాన్ అఘా, ఆర్యన్ దత్ ఇద్దరూ అతన్ని ఒకే పద్దతిలో ఔట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్ల బలహీనతలను బయటపెడుతుంది.'అని మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ తన ఆఫ్ సైడ్ ఆటను మెరుగుపర్చుకోవాలని సూచించాడు. లేకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగలేడని హెచ్చరించాడు.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా అభిషేక్ శర్మకు టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తోంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే సూపర్-8 మ్యాచ్‌లోనూ అతన్ని ఆడిస్తామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అతని ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ ఎంత అండగా నిలిచినా.. సౌతాఫ్రికాలో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రాణించడం అతనికి కీలకం. ఒక విధంగా ఈ మ్యాచ్ అతనికి అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు.