అప్పుడు అమ్మాయిలను చేర్చుకోమని చెప్పేవాళ్లు: మిథాలీ రాజ్


న్యూఢిల్లీ: బాలికలు వీధుల్లో ఆడడం, క్రికెట్ అకాడమీల్లో చేరడమనేది తన వల్ల చాలా సాధారణ విషయంగా మారి ఉంటుందని క్రికెట్ దిగ్గజం, భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. 23 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతూ ఆమె ఇటీవలే క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. లక్షలాది అమ్మాయిలకు ఆమె ప్రేరణగా నిలిచింది. మీరు వారసత్వంగా వదిలిన గొప్ప అంశం ఏంటి అన్న ప్రశ్నకు మిథాలీ..పై విధంగా స్పందించింది.
తాను క్రికెట్ మొదలుపెట్టిన రోజుల్లో అకాడమీల్లో అమ్మాయిలను చేర్చుకోమని చెప్పేవాళ్లని గుర్తు చేసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, అమ్మాయిలను తీసుకోమని ఎవ్వరూ అనడం లేదని పేర్కొంది.

అప్పుడు అమ్మాయిలు వద్దనేవారు..
‘ఈ ప్రశ్న నన్ను చాలాసార్లు అడిగారు. ఎప్పుడూ మంచి జవాబివ్వలేకపోయా. బహుశా.. ఆడపిల్లలు వీధుల్లో క్రికెట్ ఆడడం, అకాడమీల్లో చేరడాన్ని నేను సాధారణ విషయంగా మార్చి ఉంటా. నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడు అది మామూలు విషయం కాదు. మేం అకాడమీల్లో అమ్మాయిలను చేర్చుకోం. మరెక్కడికైనా తీసుకెళ్లండి' అనే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రత్యేకంగా బాలురకు మాత్రమే అన్న అకాడమీలే లేవు. ఏ అకాడమీ కూడా బాలికలను చేర్చుకోవడానికి నిరాకరించట్లేదు. బాలికలు వీధుల్లో క్రికెట్ ఆడటం, అకాడమీల్లో చేరడాన్ని నేను సాధారణ విషయం చేశానని అనుకుంటున్నా. ఇది నాకు చాలా సంతృప్తినిస్తోంది'' అని మిథాలీ చెప్పుకొచ్చింది.

వాళ్లకు మంచి భవిష్యత్తు..
ఇప్పుడున్న మహిళా క్రికెటర్లలో భారత్‌కు దీర్ఘకాలం ఆడేలా కనిపిస్తున్నది ఎవరని అడగగా.. ''కిరణ్ నవ్‌గిరే ఆసక్తి కలిగిస్తోంది. దేశవాళీ టీ20, మహిళల ఛాలెంజ్‌లో ఆమె మెరుగ్గా రాణించింది. భారత జట్టులో యస్తిక భాటియా, రిచా ఘోష్, షెఫాలీ వర్మలకు మంచి భవిష్యత్తుంది. ఎస్.మేఘనకు కొన్ని అవకాశాలే వచ్చినా మెరుగైన ప్రదర్శన చేసింది'అని తెలిపింది.

ఇప్పుడే చెప్పలేను..
వచ్చే ఏడాది జరిగే మహిళల ఐపీఎల్‌లో ఆడే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని తెలిపింది. 2012లో రిటైర్మెంట్ ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన రాహుల్ ద్రవిడ్‌ను చూసినప్పుడు తనకు తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని మిథాలీ చెప్పింది. తానెప్పుడూ స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తానని, ప్రపంచకప్ నెగ్గాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు మరో నాలుగేళ్లు వేచి చూసే పరిస్థితి లేదనే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేసింది. 2017 ప్రపంచకప్ తర్వాత స్పిన్ విభాగం బలహీనం అవ్వడంతోనే జట్టు డీలా పడిందని అభిప్రాయపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications