
ఆక్లాండ్: భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో వరుసగా విఫలమైన ఈ హైదరాబాదీ.. అసలు సిసలు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో మిథాలీ సూపర్ బ్యాటింగ్‌తో జట్టను ఆదుకుంది. 77 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిథాలీకి ఇది కెరీర్‌లో 63వ అర్ధ శతకం.
ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును అధిగమించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది.
ఇక కెప్టెన్‌గానూ మిథాలీకి ఈ మెగా ఈవెంట్‌లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా మిథాలీ చరిత్రకెక్కింది. ఆమె తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ ఆరు 50 ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో ఉంది. ప్రపంచకప్‌టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరాలంటే.. ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను తప్పక గెలవాలి.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ మిథాలీ రాజ్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 68తో పాటు యస్తిక భాటియా(83 బంతుల్లో 6 ఫోర్లతో 59), హర్మన్ ప్రీత్ కౌర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో పూజా వస్త్రాకర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) మెరుపులు మెరిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు, అలన కింగ్ రెండు, జెస్స్ జొనాస్సెన్ ఓ వికెట్ తీసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. విజయం దిశగా కొనసాగుతోంది. 41 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు అవసరమవ్వగా.. క్రీజులో కెప్టెన్ మెగ్ లాన్నింగ్(73 బ్యాటింగ్), ఎల్లిస్ పెర్రీ( 28 బ్యాటింగ్) ఉన్నారు.