టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో జరిగిన కీలక సూపర్ 8 మ్యాచ్‌లో తాను ఐదు బ్యాడ్ బాల్స్ వేసానని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఆ ఐదు చెడ్డ బంతులను రోహిత్ శర్మ సిక్సర్లుగా తరలించాడని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో రోహిత్ శర్మ(92) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
ఏడు ఫోర్లు, 8 సిక్సర్లతో ఆసీస్ బౌలర్లను చితక్కొట్టాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఓ ఓవర్‌లో భారీ షాట్లతో 29 పరుగులు పిండుకున్నాడు. దాంతో టీమిండియా 205/5 భారీ స్కోర్ చేయగా.. ఆస్ట్రేలియా 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ముందు పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిన ఆసీస్.. భారత్ చేతిలో ఎదురైన పరాజయంతో సూపర్-8లోనే ఇంటిదారిపట్టింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై స్పందించిన మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ మైదానంలో వీచే బలమైన గాలులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి అడ్వాంటేజ్‌గా మార్చుకున్నాడని చెప్పుకొచ్చాడు. 'రోహిత్ శర్మకు ప్రత్యర్థిగా నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. టీ20 ప్రపంచకప్ 2024లో అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా మా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సెయింట్ లూసియా మైదానంలో గాలులకు తగ్గట్లు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌ను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.
ఆ మ్యాచ్‌లో అతను ఒక ఎండ్‌లో ధారళంగా పరుగులు చేస్తే మరో ఎండ్‌లో ఆచితూచి ఆడాడు. దురదృష్టవశాత్తు అతను ధారళంగా పరుగులు చేసిన ఎండ్‌లోనే నేను బౌలింగ్ చేశాను. నేను ఐదు చెత్త బంతులేసాను. ఆ ఐదింటిని రోహిత్ సిక్సర్లుగా తరలించాడు.'అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.
సీడింగ్ ప్రకారం సూపర్-8 షెడ్యూల్‌ను ఖరారు చేయడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని మిచెల్ స్టార్క్ ఆరోపించాడు. లీగ్ దశలో ఇంగ్లండ్ కంటే ఎక్కువ విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచామని చెప్పిన స్టార్క్.. ప్రీసీడింగ్ కారణంగా సూపర్-8లో రెండో జట్టుగా మారిపోయమన్నాడు. దాంతో కఠినమైన గ్రూప్‌లో సూపర్-8 మ్యాచ్‌లను ఆడాల్సి వచ్చిందనన్నాడు. మ్యాచ్ టైమింగ్స్ కూడా తమ ఓటమికి కారణమయ్యాయని చెప్పాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు సన్నదమయ్యే అవకాశమే దొరకలేదన్నాడు.