టీమిండియా తాత్కలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రశంసల జల్లు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. విభిన్నమైన బౌలింగ్ యాక్షనే బుమ్రా సక్సెస్‌కు ప్రధాన కారణమని తెలిపాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన బుమ్రా అటు కెప్టెన్‌గా, ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. అద్భుతమైన బౌలింగ్‌తో బుమ్రా(4/17) ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. బుమ్రా బౌలింగ్ ధాటికి ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) పెవిలియన్ చేరారు.

అతనితో పాటు మహమ్మద్ సిరాజ్(2/17), హర్షిత్ రాణా(1/33) నిప్పులు చెరగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులే చేసింది. క్రీజులో మిచెల్ స్టార్క్(6 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) ఉన్నాడు. ఆసీస్ ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. తొలి రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మిచెల్ స్టార్క్ బుమ్రా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుందని, తాను అతనిలా బౌలింగ్ చేస్తే చేయి విరిగిపోతుందన్నాడు.
'బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా హైపర్‌ఎక్స్‌టెన్షన్‌తో ఉంటుంది. ఈ విభిన్నమైన శైలే అతని సక్సెస్‌కు కారణం. ఆ శైలికి నైపుణ్యం కూడా తోడైంది. దాంతోనే బుమ్రా మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. బుమ్రాలా బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేనైతే ఆ శైలిలో బౌలింగ్ ప్రయత్నించను. అలా చేస్తే నా చేయి విరిగిపోతుంది.'అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.