ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా స్టార్క్ ఖతర్నాక్ రిటర్న్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అతని స్టన్నింగ్ డైవ్ రిటర్న్ క్యాచ్‌కు బ్యాటర్‌తో పాటు అంపైర్, వికెట్ కీపర్, ఇతర ఫీల్డర్లు నోరెళ్లబెట్టారు. వావ్ వాటే క్యాచ్ అంటూ అవాక్కయ్యారు.
రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. స్టార్క్ ఖతర్నాక్ రిటర్న్ క్యాచ్‌తో పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ జాక్ క్రాలీ(0) వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ ఐదో బంతిని స్టార్క్ ఫుల్ లెంగ్త్‌లో వేయగా.. జాక్ క్రాలీ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్టార్క్ ఎడమవైపు దూసుకొచ్చింది. బౌలింగ్ రన్నప్‌లోనే ఈ విషయాన్ని గమనించిన స్టార్క్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దాంతో జాక్ క్రాలీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను డకౌటయ్యాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క పరుగు చేయకుండా బ్యాటర్లు ఔటయ్యారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ జాక్ క్రాలీ(0) డకౌటవ్వగా.. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జేక్ వెదర్‌లాడ్ డకౌటయ్యాడు. తాజాగా జాక్ క్రాలీ మరోసారి డకౌటవ్వడంతో మూడు ఇన్నింగ్స్‌ల్లో జిరోకే వికెట్ పడింది. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలీ పోప్(58 బంతుల్లో 4 ఫోర్లతో 46), జెమీ స్మిత్(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(7/58) ఏడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. బ్రెండన్ డొగ్గెట్(2/27) రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ(26), కామెరూన్ గ్రీన్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బెన్ స్టోక్స్(5/23) ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ (3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్(2/11)కు రెండు వికెట్లు దక్కాయి. 40 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆలౌట్ దిశగా సాగుతోంది. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 104 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఓలీ పోప్(33), బెన్ డకెట్(28), జేమీ స్మిత్(15) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.