విధ్వంసకర బ్యాటర్లతో కూడిన టీమిండియాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని, బౌండరీ లైన్లను వెనక్కి జరపాలని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ డిమాండ్ చేశాడు. భారత్ తరహా విధ్వంసకర బ్యాటర్లు ఎదుర్కోవడానికి తాము కొత్త మార్గాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. ఈ సిరీస్ కోల్పోయినా అనేక సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు. 'ఈ సిరీస్‌లో ఓడినా.. మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. నేను మొదటి నుంచి చెబుతున్నాను. భారత్ చాలా బలమైన జట్టు. ముఖ్యంగా సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం చాలా కష్టం. బౌలర్ల కోసం బౌండరీ లైన్లను కాస్త వెనక్కి జరిపితే బాగుంటుందేమో(నవ్వుతూ). ఏదేమైనా ప్రేక్షకులకు ఇది వినోదాత్మకమైన క్రికెట్ మ్యాచ్.

ఈ సిరీస్ ద్వారా ఏమైనా లక్ష్యాలను చేరుకున్నారా? అంటే అవుననే చెబుతాను. సిరీస్ పొడవునా సవాళ్లు ఎదురైనప్పుడు అది ఎప్పుడూ మంచిదే. ఈ సవాళ్లు బౌలర్లు, బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టుతాయి. తద్వారా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఆ కోణంలో చూస్తే నిజంగా ఇది మాకు మంచి సిరీస్. ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. కానీ ప్రతీ మ్యాచ్ నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంది.
ప్రపంచకప్ ముంగిట ఏం నేర్చుకున్నామంటే చెప్పడం కష్టం. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడే అద్భుతమైన బ్యాటర్లను ఎదుర్కోవడానికికే బౌలింగ్ యూనిట్‌గా మేం కొత్త మార్గాలను వెతకాలి. ముఖ్యంగా ఇలాంటి ఫ్లాట్‌పిచ్‌లపై 230 పరుగుల ఛేజ్ చేయగలమని తెలిసినప్పుడు భారీ ఓవర్లను 15, 16 పరుగులకే పరిమితం చేయడం నేర్చుకోవాలి.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(1/53), కైల్ జెమీసన్(1/59), మిచెల్ సాంట్నర్(1/60) హాఫ్ సెంచరీలు సమర్పించుకోగా. లాకీ ఫెర్గూసన్(2/41) కాస్త కట్టడిగా బౌలింగ్ చేశాడు.
న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిన్ అలెన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(3/33) మూడు వికెట్లు తీసాడు. వరుణ్ చక్రవర్తీ(1/36), రింకూ సింగ్(1/7) తలో వికెట్ పడగొట్టారు. బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాదగా.. న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.