బ్యాటింగ్‌లో చేసిన చిన్న మార్పుతోనే విజయం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో భారత్‌లా ఆధిపత్యం చెలాయించి ఆశించిన ఫలితాన్ని రాబట్టామని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిచెల్ సాంట్నర్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో తమ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని చెప్పాడు. ఏది ఏమైనా డిఫెన్సివ్‌గా ఆడకూడదని నిర్ణయించుకున్నామని, అదే తమకు విజయాన్ని కట్టబెట్టిందని తెలిపాడు.
'గత మూడు మ్యాచ్‌ల్లో భారత్ మాపై ఎలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందో ఈ రోజు పవర్ ప్లేలో మేం అలాగే ఆరంభించాం. ముఖ్యంగా గత మ్యాచ్ ఓటమి తర్వాత ఆటగాళ్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. డిఫెన్సివ్‌గా ఆడకూడదని మేం భావించాం. ఆ ఆరంభం మాకు దూకుడైన గౌరవ ప్రదమైన స్కోర్ సాధించడానికి పునాది వేసింది.
చివర్లో డారిల్ మిచెల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ప్రపంచకప్‌లో మాకు ఎలాంటి పిచ్‌లు లభించే అవకాశం ఉందో.. వాటిని దృష్టిలో ఉంచుకునే మేం ఆడుతున్నాం. చివరి మ్యాచ్ కోసం మరికొంతమంది ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వస్తున్నారు. ఇది సంతోషకరమైన విషయం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అలా చేస్తే మా స్పిన్నర్ల పనిని సులభతరం చేస్తుంది.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ సీఫెర్ట్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాన్ కాన్వే(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), డారిల్ మిచెల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(8), హార్దిక్ పాండ్యా(2) తీవ్రంగా నిరాశపర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/26) మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ(2/33), ఇష్ సోధి(2/46) రెండేసి వికెట్లు తీసారు. మ్యాట్ హెన్రీ, జాక్ ఫోక్స్ తలో వికెట్ పడగొట్టారు.