తమకు ఆ దేవుడే దిక్కు అని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో తమ భవిష్యత్తు దేవుడిపైనే ఆధారపడి ఉందని చెప్పాడు. గ్రూప్-బీలో భాగంగా పల్లెకెలె వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
ఈ టోర్నీలో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. జింబాబ్వే చేతిలోనూ ఆసీస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు గల్లంతయ్యాయి.
శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయంపై మిచెల్ మార్ష్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని అంగీకరించాడు. 'ఇది పోరాడే లక్ష్యమని నేను భావించాను. కానీ ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశ కలిగించింది. శ్రీలంక అద్భుతంగా ఆడింది. సమష్టి ప్రదర్శనతో మమ్మల్ని ఓడించింది. మేం అత్యుత్తమంగా ఆడితే భారీ స్కోర్లు చేయగలమని మాకు తెలుసు. కానీ ఇన్నింగ్స్ చివరిలో మేం పట్టు కోల్పోయాం.
సరైన భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయాం. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మాకు లభించిన ఆరంభంతో పోలిస్తే.. మేం చాలా తక్కువ స్కోర్ చేశాం. శ్రీలంక మమ్మల్ని అన్ని విషయాల్లో ఓడించిందనే విషయం తప్ప చెప్పడానికి ఇంకేం లేదు.

మా జట్టు ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉంది. ఇక మా భవిష్యత్తు దైవాధీనం. డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. మేం మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయాం. ఇప్పుడు జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆశతో ఎదురుచూస్తున్నాం. కానీ ప్రస్తుతానికైతే చాలా నిరుత్సాహంగా ఉంది.'అని మిచెల్ మార్ష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), ట్రావిస్ హెడ్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత(3/37) మూడు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలెగే, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.
అనంతరం శ్రీలంక 18 ఓవర్లలో 2 వికెట్లకు 184 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో సత్తా చాటగా.. కుశాల్ మెండీస్(38 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పవన్ రత్నాయకే(15 బంతుల్లో 6 ఫోర్లతో 28 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినీస్(2/46) రెండు వికెట్లు తీసాడు.