మిడిలార్డర్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ మార్ష్.. అద్భుతమైన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పాడు. రోహిత్, కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. 'గత 10 ఏళ్లుగా రోహిత్, విరాట్ కోహ్లీలు చాలా జట్లపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం చూశాం. ఈ మ్యాచ్‌లోనూ వారు అదే తరహా ప్రదర్శన కనబర్చారు.

మా బ్యాటింగ్‌లో మరో భాగస్వామ్యం నమోదు చేస్తే ఫలితం మరోలా ఉండేది. 3 వికెట్లకు 195 పరుగులతో గొప్ప ప్లాట్ ఫామ్ దొరికింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. బ్యాటింగ్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఈ సిరీస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.