ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్‌కు దేశం కంటే ఐపీఎల్ ఎక్కువైందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం సన్నదం కాకుండా హజెల్ వుడ్ ఐపీఎల్ ఆడటాన్ని తప్పుబట్టాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ దినపత్రికకు రాసిన కాలమ్‌లో హజెల్ వుడ్‌పై మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి జోష్ హజెల్ వుడ్ ఆడాడు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ వారంపాటు వాయిదా పడటంతో స్వదేశం వెళ్లి పోయిన హజెల్ వుడ్.. మళ్లీ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని విజేతగా నిలబెట్టాడు. 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ టైటిల్ గెలిచింది. అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. టెంబా బువుమా, మార్క్‌రమ్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో సౌతాఫ్రికా సంచలన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో జోష్ హజెల్ వుడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

దాంతో అతనిపై విమర్శలు వచ్చాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సరిగ్గా సన్నదం కాకపోవడం వల్లే మెరుగ్గా రాణించలేకపోయాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మిచెల్ జాన్సన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'ఇటీవల హజెల్ వుడ్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడటం తరుచూ చూస్తున్నాం. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నదం కాకుండా అతను ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది.'అని మిచెల్ జాన్సన్ విమర్శించాడు.
ఈ విమర్శలపై హజెల్ వుడ్ స్పందించాడు. మిచెల్ జాన్సన్ రాసిన కాలమ్ తాను చూడలేదని, డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నదతకు ఐపీఎల్ కంటే బెస్ట్ ఆప్షన్ మరేది లేదని తనకు అనిపించిందన్నాడు. 'నిజానికి మిచెల్ జాన్సన్ రాసిన కాలమ్ చూడలేదు. మా జట్టులో ఏం జరుగుతోందో మాకు తెలుసు. డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నదతకు ఐపీఎల్ కంటే బెస్ట్ ఆప్షన్ నాకు కనిపించలేదు. వాతావరణం కూడా ఓ కారణం. ఐపీఎల్‌లో పోటీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో సిడ్నీలో వర్షాలు కురుస్తున్నాయి. బ్రిస్బేన్‌లో మైదానం తడిగా ఉంది. దాంతోనే భారత్‌లో బౌలింగ్ చేయడం ఉత్తమమని అనుకున్నా. అంతేకాకుండా నేను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు టైటిల్ రేసులో ఉంది. దాంతోనే ఐపీఎల్ ఆడాను. నాకు ఇదే సరైన ఆప్షన్ అనిపించింది.'అని హజెల్ వుడ్ స్పష్టం చేశాడు.