టీమిండియా స్టార్ క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలతో పాటు చాలా మంది కుర్రాళ్ల ప్రతిభను ముంబై ఇండియన్సే వెలికి తీసిందని ఆ జట్టు యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైరపర్సన్ నీతా అంబానీ వెల్లడించారు. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాల ప్రతిభను ఎలా గుర్తించామనే విషయాన్ని ఓ కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ వెల్లడించారు.
ప్రతీ రంజీ మ్యాచ్‌కు వెళ్లాం..
'ఐపీఎల్‌లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు ఫిక్స్‌డ్ బడ్జెట్ ఉంటుంది. ప్రతీ జట్టు ఆ మొత్తంలోనే ఆటగాళ్లను తీసుకోవాలి. దాంతో ప్రతిభ కలిగిన ఆటగాళ్లను తీసుకునేందుకు చాలా మార్గాలను అన్వేషించాం. ప్రతీ రంజీ మ్యాచ్‌కు వెళ్లాం. దేశవాళీ క్రికెట్ ద్వారా నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించడం సులువవుతుందని మా టీమ్ భావించింది. ఇలా ఓ రోజు మా టీమ్ ఇద్దరూ కుర్రాళ్లను ఎంపిక చేసి ముంబై క్యాంప్‌కు తీసుకొచ్చింది.

మ్యాగీ, న్యూడుల్స్ మాత్రమే..
అప్పటికి వారిద్దరూ చాలా బక్కపలచగా ఉన్నారు. వారితో నేను ప్రత్యేకంగా మాట్లాడాను. గత మూడేళ్లగా మ్యాగీ, న్యూడుల్స్ మాత్రమే తిన్నామని చెప్పారు. ఎందుకని అడిగితే డబ్బులు లేవని బదులిచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనూ వారు పట్టుదలతో మాట్లాడారు. వారి ఉత్సాహం, ఆట పట్ల ఉన్న అభిరుచిని గమనించా. ఆ ఇద్దరు ఎవరో కాదు ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. అతని సోదరుడు కృనాల్ పాండ్యా. ఇది 2015లో జరిగింది.
రూ. 10 లక్షలకే కొన్నాం..
పాండ్యాను తొలి సారి రూ. 10 లక్షల కనీస ధరకు వేలంలో తీసుకున్నాం. ఇప్పుడు అతను మా కెప్టెన్. ఆ మరుసటి ఏడాది మా టాలెంట్ స్కౌట్ టీమ్ మరో ఆటగాడిని తీసుకొచ్చింది. అతని బౌలింగ్‌ను చూసి ఎంపిక చేసామని చెప్పారు. బాడీ లాంగ్వేజ్ చాలా విభిన్నంగా ఉంది. అతని బౌలింగ్‌ను మేం చూశాం. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఎవరో కాదు జస్‌ప్రీత్ బుమ్రా. అతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గతేడాది మేం తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నాం. అతను ఇప్పుడు టీమిండియా కీలకమైన ప్లేయర్‌గా మారాడు. ముంబై ఇండియన్స్.. టీమిండియాకు ఓ నర్సరీలాంటిది. అద్భుతమైన ఆటగాళ్లను ఎప్పటికీ అందిస్తూ ఉంటుంది.'అని నీతా అంబానీ వెల్లడించారు.