WTC Final: మ్యాచ్ ప్రాక్టీస్ ఏమో కానీ బ్యాక్ టూ బ్యాక్ ఆడటం న్యూజిలాండ్‌కు ఇబ్బందే!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ) ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం టీమిండియా కొంపముంచుతుందని, ఇంగ్లండ్‌తో ఆడుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్ న్యూజిలాండ్‌కు అడ్వాంటేజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
మ్యాచ్ ప్రాక్టీస్ ఏమో కానీ బ్యాక్ టూ బ్యాక్ ఆడటం న్యూజిలాండ్‌కు ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు. నాలుగు రోజుల బ్రేక్‌తో మూడు టెస్టులను వరుసగా ఆడటం తమ ఆటగాళ్లకు భారమేనని తెలిపాడు. పని భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆర్‌సీబీ కోచ్ టీమిండియాకు పలు సూచనలు చేశాడు. ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుందన్నాడు. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని టీమిండియాకు సూచించాడు. ఐదుగురు బౌలర్లను ఆడిస్తే అశ్విన్, జడేజా ఇద్దరికీ చోటివ్వాలని, ఆస్ట్రేలియా తరహాలో రిషభ్ పంత్ ఫైనల్లో కీలకమవుతాడని పేర్కొన్నాడు.

నాలుగు రోజుల బ్రేక్‌తో ఆడటం..
'నాలుగు రోజుల బ్రేక్‌తో మూడు టెస్టులు ఆడటం సమస్యే. న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్‌ను పర్యవేక్షించుకోవాలి. అందుకే ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ట్రెంట్‌బౌల్ట్‌ను తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో మరొకరికి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే రెండో టెస్టులో 45-50 ఓవర్లు వేస్తే పనిభారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. డబుల్ సెంచరీ హీరో డేవాన్ కాన్వే అద్భుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడు అర్హత సాధిస్తాడా అని ఎదురుచూశాం. టామ్ బ్లండెల్‌కు చోటివ్వకపోవడం కఠిన నిర్ణయమే. కానీ కాన్వే కోసం తప్పదు.

పోటీ నువ్వా-నేనా అన్నట్లే
ప్రతి మైదానం భిన్నంగానే ఉంటుంది కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ ముఖ్యం. అయితే భారత్‌కు ఏ మైదానంలోనైనా ఆడగల సత్తా, వనరులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఆ జట్టు నిరూపించింది కూడా. న్యూజిలాండ్ ముందుగా రెండు టెస్టులాడినా.. భారత్‌కు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా.. ఫైనల్లో పోటీ మాత్రం నువ్వా-నేనా అన్నట్టే ఉంటుంది. రెండు జట్ల ఓపెనర్లు స్వింగయ్యే బంతుల్ని ఎలా ఎదుర్కొంటారన్నది కీలకం. ఏ జట్టు టాప్ ఆర్డర్ ఎక్కువ పరుగులు చేస్తే వారికి అవకాశాలు ఉంటాయి.

ఆ ఇద్దరిని తీసుకోవాలి..
డ్యూక్ బంతులతో స్పిన్నర్లూ రాణించగలరు. జడేజా, అశ్విన్ ఉండటంతో టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. ఈ ఇద్దరు స్పిన్నర్లకూ తుది జట్టులో చోటివ్వాలి. ఎందుకంటే న్యూజిలాండ్‌లో ఐదుగురు లెఫ్టాండ్, ఆరుగురు రైట్ హ్యాండ్ ఆటగాళ్లు ఉన్నారు. పంత్ ఫైనల్లో కీలకమవుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. స్వేచ్ఛగా ఆడతాడు. జట్టులోనూ ఘనత అందుకున్నాడు.

ఓపెనర్‌గా మయాంక్..
బహుశా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేయించాలని టీమిండియా భావిస్తుండొచ్చు. అయితే శుభ్‌మన్‌కు బదులు మయాంక్ అగర్వాల్‌ను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. గతేడాది న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లో అతను కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మిగతావాళ్ల కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ఆ లెక్కన అతనికి అవకాశం ఇవ్వాలి' అని హెసన్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను బెస్టాఫ్ 3 ఫార్మాట్‌లో నిర్వహించాలన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయంతో హెసన్ ఏకీభవించాడు. అలా చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ మరింత రసవత్తరంగా సాగుతుందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications