
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా.. మయాంక్ అగర్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ సూచించాడు.
కివీస్ పేసర్లను ఎదుర్కొన్న అనుభవం ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌కు ఉందన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్ హెసన్ కోహ్లీసేనకు పలు సూచనలు చేశాడు. ఐదుగురు బౌలర్లను ఆడిస్తే అశ్విన్, జడేజా ఇద్దరికీ చోటివ్వాలని, ఆస్ట్రేలియా తరహాలో రిషభ్ పంత్ ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో కీలకమవుతాడని పేర్కొన్నాడు. ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుందన్నాడు.
'భారత్ కచ్చితంగా రోహిత్ శర్మ- శుభ్‌మన్‌గిల్‌తో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. అయితే, మయాంక్‌ను కూడా తుది జట్టులో ఆడించాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతేడాది కివీస్ పర్యటనలో అతను రెండు టెస్టులు ఆడాడు. దాంతో న్యూజిలాండ్ పేసర్లను ఎదుర్కొన్న అనుభవం కాస్త అయినా అతనికి ఉండి ఉంటుంది' అని హెసన్ పేర్కొన్నాడు. కాగా, ఆ సిరీస్‌లో మయాంక్ రెండు టెస్టుల్లో కలిపి 34, 58, 7, 3 పరుగులే చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో 17, 9, 0, 5, పరుగులు చేసిన మయాంక్ చివరిదైన గబ్బా టెస్టులో 38, 9 పరుగులు చేశాడు.
దాంతో టీమిండియా అతన్ని ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌కు దూరం చేసింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కూ ఎంపికయ్యాడు. అయితే, తుది జట్టులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆడించాలని హెసన్ సూచించాడు. ఇక మ్యాచ్ ప్రాక్టీస్ ఏమో కానీ బ్యాక్ టూ బ్యాక్ ఆడటం న్యూజిలాండ్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని మైకేహెసన్ చెప్పుకొచ్చాడు. నాలుగు రోజుల బ్రేక్‌తో మూడు టెస్టులను వరుసగా ఆడటం తమ ఆటగాళ్లకు భారమేనని తెలిపాడు. పని భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.