
లండన్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలా శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీయలేడని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అన్నాడు.ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో శార్దూల్ బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై అతను ప్రభావం చూపలేడని పేర్కొన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి.. చివరికి 290 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత భారత బౌలర్లు విజృంభించినా..తర్వాత తేలిపోయారు. దాంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతనిపై బౌలింగ్‌పై స్పందించిన మైకెల్ హోల్డింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇంగ్లండ్ ఆటగాళ్లపై భారత బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోవడం నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ పూర్తిగా తేలిపోయాడు. వాస్తవానికి అతను బుమ్రా, ఉమేశ్ యాదవ్ లాగా వికెట్లు తీసే బౌలర్ కాదు. ఇంగ్లండ్ పిచ్‌లపై అతను ప్రభావం చూపలేడు. చాలా రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బుమ్రా, ఉమేశ్ ఇద్దరూ బాగా బౌలింగ్ చేశారు. బుమ్రా కన్నా ఉమేశ్ చాలా ప్రభావంతంగా కనిపించాడు. బుమ్రా సైతం కొన్ని అద్భుతమైన బంతులు సంధించాడు'అని మైకేల్ హోల్డింగ్ చెప్పుకొచ్చాడు. ఇక శార్దూల్ తొలి ఇన్నింగ్స్‌లో.. బంతితో అంతగా రాణించనప్పటికీ.. బ్యాట్‌తో మాత్రం మెరిసాడు. కేవలం 36 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు స్కోరు 191 పరుగులకు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
మూడో రోజు ఆటలో బ్యాటింగ్‌లో సత్తా చాటిన టీమిండియా.. విన్నింగ్ రేసులోకి దూసుకొచ్చింది. తొలిసారి ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 127) నిలబడి సెంచరీతో కదంతొక్కితే... చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 9 ఫోర్లతో 61), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.
అయితే 270/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఫస్ట్ సెషన్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు రవీంద్ర జడేజా(17)8 పరుగులు జత చేయగా.. రహానే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికి పోయాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(25 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్( 22 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ ఇప్పటికే 250 పరుగుల లీడ్ అందుకుంది.