
న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఏది పడితే అది బుక్‌లో రాయడం కామన్ అయిపోయిందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైఖెల్ హోల్డింగ్ అన్నాడు. సెన్సేషన్, వార్తల్లో నిలవడం కోసం ముందు వెనుకా ఆలోచించకుండా రాస్తున్నారని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పుస్తకాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
2015 ప్రపంచకప్ నిష్క్రమణ నుంచి 2019 వరల్డ్‌కప్ అందుకునే వరకు సాగిన ఇంగ్లండ్ టీమ్ ప్రయాణాన్ని తన స్వీయ అక్షరాలతో బుక్ రూపంలో తీసుకొచ్చిన స్టోక్స్.. దానికి 'బెన్‌స్టోక్స్ ఆన్ ఫైర్'అని నామకరణం చేశాడు. త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నాడు. అయితే ఈ పుస్తకం రిలీజ్ కాకముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
ముఖ్యంగా గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత ఓడిన లీగ్ మ్యాచ్‌ను తన పుస్తకంలో ప్రస్తావించిన స్టోక్స్.. ధోనీలో మ్యాచ్ గెలవాలనే కసి కనిపించలేదని రాసుకొచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు స్టోక్స్ అభిప్రాయాన్ని తప్పుబట్టారు. ఇక వెస్టిండీస్ దిగ్గజం మైఖెల్ హోల్డింగ్ కూడా స్టోక్స్ వ్యాఖ్యలతో విభేదించాడు.
'ఈ రోజుల్లో పుస్తకాల్లో ఏది పడితే అది రాస్తున్నారు. ఎందుకంటే వారు బుక్ రాస్తున్నప్పుడు చాలా స్వేచ్చగా తమ అభిప్రాయాలను అందులో ప్రస్తావిస్తున్నారు. కానీ వారు కొన్ని ముఖ్యాంశాలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ చాలా మంది చూశారు. వారంతా మ్యాచ్ గెలవాలనే తపన ధోనీలో కనిపించలేదనే బెన్ స్టోక్స్ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. 'అని తన అధికారిక యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
ఇక ఆ మ్యాచ్‌లో భారత్ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల అభిప్రాయాలను కూడా హోల్డింగ్ తప్పుబట్టాడు. 'ఇక అది భారత్ గెలవాల్సిన మ్యాచ్ కాదు. కానీ ఎవరైన ఓడిపోవడమే ఆ జట్టు వ్యూహం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆ మ్యాచ్‌ను నేను చూశా. భారత్ విజయం కోసం 100 శాతం ప్రయత్నించింది. ధోనీ ముఖంలో మ్యాచ్ గెలవాలనే పట్టుదల కనిపించింది. కాబట్టి ఓడిపోవడం అనేది జట్టు నిర్ణయం ఏమాత్రం కాదు.'అని తెలిపాడు. ఇక రోహిత్-కోహ్లీ నిదానంగా ఆడటాన్ని కూడా స్టోక్స్ విమర్శించగా..దీనిపై కూడా హోల్డింగ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సి ఉంటుందన్నాడు.