
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను పాయింట్ల పద్దతిలో నిర్వహించడాన్ని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ తప్పుబట్టాడు. ఈ విధానం చాలా హాస్యాస్పదంగా ఉందని, దీనిలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దీనివల్ల కొన్ని జట్లలో ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు. గత ఆగస్టులో ప్రారంభమైన ఈ టెస్టు చాంపియన్‌షిప్‌లో టాప్-2 జట్లు 2021, జూన్‌లో జరిగే ఫైనల్‌లో తలపడతాయి. ఇందులో భాగంగా జరిగే ఒక్కో సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించారు. ఒకవేళ ఐదు టెస్టులు ఆడితే మ్యాచ్‌కు 24, రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు 60 పాయింట్లుగా ఉంటోంది.
అంటే ఏదైనా టీమ్ కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి 120 పాయింట్లు సాధించొచ్చు. అప్పుడు మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లాభం ఏంటనే దానిపై స్పష్టత లేదు. ఇదే విషయాన్ని హోల్డింగ్ తప్పుబడుతున్నాడు. ఈ పద్దతి వర్కౌట్ కాదని విమర్శించాడు. 'పాయింట్ల సిస్టమే హాస్యాస్పదం. ఐదు మ్యాచ్‌లు ఆడితే వచ్చే పాయింట్లు రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడినా వస్తాయి. అలాంటప్పుడు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడటం వల్ల లాభం ఏంటి? ఒకానొక స్టేజ్‌కు వెళ్లాకా.. ఫైనల్‌కు చేరే చాన్స్ ఉండదని కొన్ని టీమ్‌లకు అర్థమైపోతుంది. అప్పుడు ఆడే మ్యాచ్‌ల్లో మజా ఉండదు. ఇది కేవలం మరో టెస్ట్ అని ప్రేక్షకులు కూడా భావిస్తారు'అని హోల్డింగ్ పేర్కొన్నాడు.