ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులోకి లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే సత్తా కుల్దీప్ యాదవ్‌కు ఉందని తెలిపాడు. తొలి టెస్ట్‌లో అతన్ని ఆడించకపోవడం టీమిండియా మేనేజ్‌మెంట్ బుద్ది తక్కువ నిర్ణయమని విమర్శించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఐదు రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐదు శతకాలు సాధించినా భారత్ విజయాన్నందుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజాతో ఆడింది. అతను తీవ్రంగా నిరాశపర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీసాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత బౌలింగ్ విభాగంలో నేను ఎవర్నీ నిందించాలనుకోవడం లేదు. కానీ వారు కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. అతన్ని ఆడించకపోవడం బుద్ది తక్కువ నిర్ణయం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీసే సత్తా అతనికి ఉంది. తొలి టెస్ట్‌లో అతను మరింత ప్రభావం చూపేవాడు. బౌలింగ్ లైనప్ కంటే బ్యాటింగ్ డెప్త్‌కు టీమిండియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చాలా కాలంగా ఇలా చేస్తుంది. ఎక్స్‌ట్రా బ్యాటర్ ఉండటంతో పాటు బ్యాటింగ్ డెప్త్ ఉండేలా జాగ్రత్తపడుతుంది. ఈ క్రమంలో వారు తమ నెంబర్ వన్ స్పిన్నర్‌ను కూడా పక్కనపెట్టేస్తున్నారు.
ఇంగ్లండ్ గడ్డపై విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయాలి. బుమ్రా స్టార్ పేసర్. అతను బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు.కానీ ఇతర పేసర్ల నుంచి సహకారం లభించడంలేదు. కొన్నిసార్లు వారు బాగానే బౌలింగ్ చేసినా.. వికెట్లు తీయడం ఎలాగో నేర్చుకోవాల్సి ఉంది. వారి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలి. జడేజా పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అతను లెఫ్టార్మ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతాడని భావించాను. కానీ అతను విఫలమయ్యాడు. అతను మరీ స్ట్రైట్‌గా బౌలింగ్ చేసినట్లు అనిపించింది.'అని మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు.