ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అంచనా వేసాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో టీమిండియా విజయం సాధిస్తుందన్నాడు. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ 2025 ట్రోఫీ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌తో లీగ్ దశకు తెరపడనుంది.
గ్రూప్-ఏ నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరగా.. గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అర్హత సాధించాయి. అయితే రెండు గ్రూప్‌ల టాప్-2 పొజిషన్స్ ఇంకా తేలలేదు. దాంతో సెమీస్‌లో ఏ జట్లు తలపడుతాయనేదానిపై క్లారిటీ లేదు. భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్లోనే తలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫైనల్ చేరేది ఆ జట్లే..
తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరే జట్ల గురించి మాట్లాడిన మైకేల్ క్లార్క్.. ఆసక్తికర జోస్యం చెప్పాడు. 'నా అంచనా ప్రకారం ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ చేరుతాయి. నేను ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాను. కానీ నా అంచనా ప్రకారం భారత్ టైటిల్ గెలుస్తుందనిపిస్తోంది. ప్రస్తుతం వన్డేల్లో టీమిండియానే నెంబర్ వన్ టీమ్. ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిస్తోంది.
ఈ టోర్నీలో రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది. అతను ఫామ్‌లోకి వచ్చాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కటక్‌లో అతను కొట్టిన సెంచరే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా అతను బంతిని బాదిన విధానం అమోఘం. దుబాయ్ కండిషన్స్‌లో అతను కీలక పాత్ర పోషించనున్నాడు. దూకుడైన ఆటతో పవర్ ప్లేను ఉపయోగించుకోనున్నాడు. అతను రిస్కీ షాట్స్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిస్తే.. రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు.'అని మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు.