భారత్ చేతిలో ఓడినా.. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లడం గర్వంగా ఉందని న్యూజిలాండ్ తాత్కలిక వన్డే కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ అన్నాడు. బ్యాటింగ్‌లో మరో 20-30 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క తప్పిదమే తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్‌తో టీమిండియా గట్టెక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బ్రేస్‌వెల్.. ఈ మ్యాచ్‌లో ఓడినా గర్వంగా ఉందని చెప్పాడు. వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌ను ఒత్తిడిలోకి నెట్టామని సంతోషం వ్యక్తం చేశాడు. 'మా ప్రయత్నం పట్ల మేం గర్వపడుతున్నాం. ప్రపంచంలోనే నంబర్ 1 జట్టును ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లి ఒత్తిడిలోకి నెట్టాం. ఇది ఎప్పుడూ సంతోషాన్నిచ్చే విషయమే. అయితే మేం సరిచేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. బ్యాటింగ్‌లో మేం 20 నుంచి 30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన జెమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

అతని ప్రదర్శన మాకు పెద్ద సానుకూల అంశం. అతను 15 ఓవర్లు వేసి ఉంటే బాగుండేదనిపించింది. మా బ్యాటింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణించింది. మిచెల్ తన నిలకడను కొనసాగించాడు. ఇన్నింగ్స్ చివర్లో మేం కొన్ని పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారేది. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే క్షణాలను సృష్టించడం మేం చాలా మాట్లాడుకున్నాం. ఈ రోజు కొన్ని చేసినా..కీలకమైన అవకాశాలను చేజార్చుకున్నాం. భారత్‌లో లైట్ల కింద ఆడటం అంత సులువు కాదు. కానీ మేం మా కోసం అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. వాటి కోసం నిరంతం శ్రమిస్తూనే ఉంటాం.'అని మైఖేల్ బ్రెస్‌వెల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.
అఅనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసి గెలుపొందింది.. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. శుభ్‌మన్ గిల్(71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. హర్షిత్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), కేఎల్ రాహుల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(4/41) నాలుగు వికెట్లు తీయగా.. ఆదిత్య అశోక్, క్రిస్టన్ క్లార్క్ తలో వికెట్ తీసారు.