క్రిస్టియన్ క్లార్క్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో విజయం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్ వెల్ అన్నాడు. భారత జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితం చేయడంతోనే సగం విజయాన్ని అందుకున్నామని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన మైఖేల్ బ్రెస్‌వెల్.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఇది మా జట్టు కనబర్చిన సమష్టి ప్రదర్శన. నా జట్టు ఆటతీరును చూసి గర్వపడుతున్నా. ఇన్నింగ్స్ విరామ సమయంలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. భారత్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతోనే సగం మ్యాచ్ గెలిచాం. బౌలింగ్‌లో ఇది విలక్షణమైన కివీస్ ప్రదర్శన. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఎంత లక్ష్యాన్నైనా ఛేదించడానికి సిద్దంగా ఉన్నాం.

భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. కానీ మా బ్యాటర్లు పరిస్థితులకు అనుగుణంగా ఆడారు. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఆ తర్వాత డారిల్, యంగ్ మ్యాచ్‌ను భారత్ నుంచి లాక్కున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్‌ను అద్భుతంగా ఎదుర్కొన్నారు. మా బ్యాటర్లు కండిషన్స్‌ను బాగా రీడ్ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆడారు. వారి ప్రదర్శన పట్ల మేం గర్వపడుతున్నాం. మా అరంగేట్ర ప్లేయర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత గడ్డపై అరంగేట్రం చేయడం అంత సులువు కాదు. అతను చాలా క్లిష్టమైన ఓవర్లలో బౌలింగ్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 92 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్(3/56) మూడు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, జాక్ ఫోక్స్, జైడన్ క్లార్క్, మైఖేల్ బ్రెస్‌వెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలుపొందింది. డారిల్ మిచెల్(117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 131 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. గ్లేన్ ఫిలిప్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.