ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్నందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్ ఆకాశ్ మాధ్వాల్(4/37) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో కామెరూన్ గ్రీన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 నాటౌట్ ) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీ సాధించగా.. సూర్యకుమార్ యాదవ్( 16 బంతుల్లో 4 ఫోర్లతో 25) మెరుపులు మెరిపించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. వివ్రాంత్ శర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69), మయాంక్ అగర్వాల్(46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆకాశ్ మధ్వాల్(4/37) నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. క్రిస్ జోర్డాన్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలోనే 2 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మయాంక్ దగర్ చెరో వికెట్ తీసారు.
ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచిన ముంబై.. గుజరాత్-ఆర్‌సీబీ మ్యాచ్ ఫలితం ఆధారంగా టోర్నీలో ముందడుగు వేయనుంది. ఆర్‌సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారగా.. 10.58 గంటలకు కటాఫ్ టైమ్‌గా అంపైర్లు ప్రకటించారు. ఆ లోపు మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే 5 ఓవర్ల గేమ్ ఆడించనున్నారు. వర్షంతో మ్యాచ్ రద్దయితే ముంబై ప్లే ఆఫ్స్ చేరనుంది.
శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(14)ను భువనేశ్వర్ కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టును ముందుకు నడిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఈ జోడీ విరుచుకుపడటంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. మార్క్‌రమ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ జోడీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో కామెరూన్ గ్రీన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 31 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మయాంక్ దగర్ విడదీసాడు. రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి రెండో వికెట్‌కు నమోదైన 128 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి సూర్య రాగా.. గ్రీన్ తన జోరును కొనసాగించాడు.
సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ సునాయస విజయాన్నందుకుంది. విన్నింగ్ రన్‌తో కామెరూన్ గ్రీన్ 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ.