ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న 1000వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లతో 124 )సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా.. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యశస్వీ శతక్కొట్టడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు, పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, రిలే మెరిడిత్ తలో వికెట్ తీసారు.
అదిరిపోయే ఆరంభం..:టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్(18), యశస్వీ జైస్వాల్ అదరిపోయే ఆరంభాన్ని అందించారు. జోస్ బట్లర్ ఆచితూచి ఆడినా.. జైస్వాల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మెరిడిత్ వేసిన ఐదో ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదిన జైస్వాల్.. పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసింది.

దెబ్బతీసిన చావ్లా..:క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని పీయూష్ చావ్లా విడదీసాడు. జోస్ బట్లర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(14)ను అర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. పడిక్కల్(2)ను పియూష్ చావ్లా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ తన జోరును కొనసాగించాడు.
జాసన్ హోల్డర్ సాయంతో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక హోల్డర్(11)ను ఆర్చర్ పెవిలియన్ చేర్చగా.. షిమ్రాన్ హెట్‌మైర్(8)ను అర్షద్ ఖాన్ ఔట్ చేశాడు. మెరిడిత్ బౌలింగ్‌లో ధృవ్ జురేల్(2) కూడా విఫలమవడంతో జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు.
చెలరేగిన యశస్వీ..:మెరిడిత్ వేసిన 18వ ఓవర్‌లో చివరి మూడు బంతులను హ్యాట్రిక్ బౌండరీలుగా మలిచి 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశస్వీకి కెరీర్‌లో ఇది తొలి సెంచరీ కాగా.. అతిపిన్న వయసులో ఈ ఘనతను అందుకున్న నాలుగో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. సెంచరీ అనంతరం అదే జోరును కొనసాగించిన యశస్వీ.. ఆఖరి ఓవర్‌లో అర్షద్ ఖాన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ బౌండరీ బాదడంతో రాజస్థాన్ 212 పరుగులు చేసింది.