ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పేల బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్(3/22), యుజ్వేంద్ర చాహల్(3/11), బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్‌లతో 32) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చాహల్, బౌల్ట్‌కు తోడుగా నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 127 పరుగులు చేసి 27 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. రియాన్ పరాగ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫకా ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ సీజన్‌లో రియాన్ పరాగ్ నిలకడగా రాణిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ సూపర్ ఫామ్ కనబర్చాడు. లక్నోతో మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన అతను ఢిల్లీ క్యాపిటల్స్‌తో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో రియాన్ పరాగ్ ఆగడం లేదుగా..అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
స్వల్ప స్కోర్ కావడంతో ముంబై బౌలర్లు ఏం చేయలేకపోయారు. ఆకాశ్ మధ్వాల్ మూడు వికెట్లు తీసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేయాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆడుతూ పాడుతూ గెలిచింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోర్ సమర్పించుకున్న ముంబై ఇండియన్స్.. తాజా మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.