MI vs RR:రసవత్తర పోరులో రాజస్థాన్ విజయం.. రెండో మ్యాచ్‌లోనూ ముంబైకి తప్పని పరాజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు చిత్తయింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్(68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. షిమ్రాన్ హెట్‌మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), సంజూ శాంసన్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30)తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బుమ్రా, టైమిల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ప్చ్.. ముంబై..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54), తిలక్ వర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. చివర్లో పొలార్డ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) మెరుపులు మెరిపించినా.. చేధించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ముంబైకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, సైనీ రెండేసి వికెట్లు తీయగా.. బౌల్ట్, ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ విఫలం..
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారీ సిక్సర్‌తో జోష్‌గా కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ(10) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్(5) మరోసారి నిరాశపరిచాడు. సైనీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి రెండో అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్ ధాటిగా ఆడటంతో ముంబై.. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

చెలరేగిన తెలుగోడు
ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ ఆర్‌ఆర్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అతని జోరుకు ట్రెంట్ బౌల్ట్ బ్రేక్ వేయగా.. మూడో వికెట్‌కు నమోదైన 81 పరుగులకు తెరపడింది. ఆ వెంటనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తనపై ముంబై మేనేజ్‌మెంట్ పెట్టుకున్ననమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన తిలక్ వర్మను అశ్విన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

పొలార్డ్ హిట్టింగ్‌తో టెన్షన్..
ఆ తర్వాత చాహల్ తన మ్యాజిక్ బాల్స్‌తో టీమ్ డేవిడ్(1), డానియల్ సామ్స్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. అయితే సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ కరుణ్ నాయర్ తప్పిదం కారణంగా చాహల్ హ్యాట్రిక్ చాన్స్ మిస్ చేసుకున్నాడు. మురుగన్ అశ్విన్ ఇచ్చిన స్లిప్ క్యాచ్‌ను కరుణ్ నాయర్ నేలపాలు చేశాడు. దాంతో మ్యాచ్ రాజస్థాన్ చేతిలోకి వచ్చింది. కానీ డేంజరస్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ భారీ షాట్లు ఆడటంతో టెన్షన్ పెరిగింది. ప్రసిధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో పొలార్డ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద జైస్వాల్ నేలపాలు చేశాడు. దాంతో చివరి ఓవర్లో ముంబై విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఫస్ట్ బాల్ వైడ్ వేసిన సైనీ.. రెండో బాల్ బౌండరీ ఇవ్వడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ తర్వాతి బంతులను సైనీ డాట్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications