ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఆదివారం వాంఖడే వేదికగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా.. ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. సరైన బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్‌ను పెట్టడంలో విఫలమయ్యాడు. బౌలర్‌గానూ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించింది. ఫిల్ సాల్ట్ ఔటైనా.. రజత్ పటీదార్ విరుచుకుపడటంతో ఆర్‌సీబీ 240 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.

కెప్టెన్‌గా హార్దిక్ చేతులెత్తేయడంతో సూర్య ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేశాడు. ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేయడంతో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఆర్‌సీబీ బ్యాటర్ల విధ్వంసంతో హార్దిక్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎంతలా అంటే తన బౌలింగ్‌లో బౌండరీలు వస్తుండటంతో ఫీల్ట్ సెటప్ చెక్ చేయవా? అని వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్‌పై అసహనం వ్యక్తం చేశాడు. తానే కెప్టెన్ అని, ఫీల్డ్ సెటప్ పెట్టింది కూడా తానే అనే విషయాన్ని మర్చిపోయాడు.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌లో కూడా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తడబడటంతో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్ చేయడంలో హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడుతున్నాడు. సరైన సమయంలో జస్‌ప్రీత్ బుమ్రాను వాడుకోలేకపోతున్నాడు. నిర్ణీత సమయంలో ఓవర్లు కూడా పూర్తి చేయించలేక స్లో ఓవర్‌రేట్‌కు కారణమయ్యాడు.
నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిన ముంబై ఇండియన్స్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 10 మ్యాచ్‌ల్లో 7 గెలవాలి. కానీ ఆ జట్టు హార్దిక్ పాండ్యా పేలవ కెప్టెన్సీతో పాటు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. బుమ్రా, తిలక్ వర్మ ఫామ్ కోల్పోగా.. ఇతర ఆటగాళ్లు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయలేకపోతున్నారు. గొప్పగా ఆడుతున్న రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఎలా రాణిస్తుందో అనే అందోళన అభిమానుల్లో నెలకొంది.