ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఘోర పరాజయం ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌తో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్.. పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలవగా.. ఆర్‌సీబీ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు చివరి మూడు మ్యాచ్‌లను తప్పకుండా గెలవాలి. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌ర్లతో 83)అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి ముంబైకి అద్భుత విజయాన్నందించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగారు.
చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 200 పరుగులు చేసి 21 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సూర్యకు తోడుగా నెహాల్ వధేరా(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇషాన్ కిషన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో వానిందు హసరంగా, విజయ్ కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారీ లక్ష్యచేధనలో ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లతో పాటు బౌండరీలు బాదడంతో ఆర్‌సీబీ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. పేసర్లు తేలిపోవడంతో పవర్ ప్లేలోనే ఫాఫ్ డుప్లెసిస్.. స్పిన్నర్ అయిన హసరంగాను రంగంలోకి దింపాడు.
హసరంగా ఒకే ఓవర్‌లో డేంజరస్ ఇషాన్ కిషన్‌తో పాటు ఫామ్‌లో లేని రోహిత్ శర్మను ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సూరీడు, వధేరా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగారు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్య.. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు వధేరా కూడా హిట్టింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. చివర్లో సూరీడు ఔటైనా.. నెహాల్ వధేరా సాయంతో సునాయస విజయాన్నందుకుంది.