ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్(7) దారుణంగా విఫలమయ్యాడు. వానిందు హసరంగా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు.
ఈ ఓవర్ చివరి బంతికి స్టెప్ ఔటైన రోహిత్.. లెగ్‌సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి గమనాన్ని అంచనా వేయకపోవడంతో బ్యాట్‌ను మిస్సైన బంతి అతని ప్యాడ్లను తాకింది. వెంటనే ఆర్‌సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. రోహిత్ శర్మ స్టెప్ ఔట్ అవ్వడంతో పాటు బంతి వికెట్లను మిస్సవుతుందని అంతా అనుకున్నారు. 3 మీటర్ నిబంధన ప్రకారం వికెట్లకు బ్యాటర్ మూడు మీటర్లు అంతకంటే ఎక్కువ దూరంగా ఉంటే ఔటివ్వరు.

దాంతోనే హసరంగా కూడా రివ్యూ కోసం పట్టుబట్టలేదు. కానీ ఫాఫ్ డుప్లెసిస్ రివ్యూ తీసుకోగా.. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకినట్లు తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. రోహిత్ శర్మ మాత్రం బిత్తరపోయాడు. ఇదేలా ఔట్ అని ఆశ్చర్యపోయాడు. అయిష్టాంగానే మైదానం వీడిన రోహిత్.. నేరుగా ముంబై డగౌట్‌లోకి వెళ్లి వీడియో అనలిస్ట్‌తో మాట్లాడాడు.
అది అలా ఎలా ఔటని ప్రశ్నించాడు. ముంబై సపోర్ట్ స్టాఫ్ సైతం ఈ వికెట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్దంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇక ఈ ఓవర్ నాలుగో బంతికే ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్(42)ను హసరంగా పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లు ఇద్దర్నీ ఔట్ చేసి ఆర్‌సీబీకి కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగారు. చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.