ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఓపెనర్ విరాట్ కోహ్లీ(1) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ త్వరగా ఔటవ్వడంపై లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హక్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఆర్‌సీబీ-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను మామిడి పండ్లు చీకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. విరాట్ కోహ్లీని ఉద్దేశించే నవీన్ ఉల్ హక్ ఈ పోస్ట్ పెట్టాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. అనవసరంగా కోహ్లీని గెలకవద్దని కెరీర్‌లో తీవ్రంగా నష్టపోతావని హెచ్చరిస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్-ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో నవీన్ ఉల్ హక్ గొడవపడిన విషయం తెలిసిందే. మహమ్మద్ సిరాజ్‌తో మొదలైన ఈ గొడవ చివరకు గంభీర్-కోహ్లీ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ఈ సీజన్‌లోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది.
కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేయగా.. విరాట్ కోహ్లీ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. పిచ్‌పై పరుగెత్తితే తన షూస్ కింద మట్టి ఉండదా? పిచ్ ఫుట్ మార్క్స్ ఉండవా? అని అంపైర్లకు వివరించాడు.
అయితే కోహ్లీ కాలు ఎత్తడంతో నవీన్ ఉల్ హక్‌ను అవమానించాడని, కాలి కింది మట్టితో సమానమని అన్నాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అపార్ధం చేసుకున్నారు. గౌతమ్ గంభీర్ సైతం ఇలానే పొరబడి కోహ్లీతో మాటల యుద్దానికి దిగాడు.
ఈ గొడవ లక్నో-ఆర్‌సీబీ మధ్య పోరును ఆసక్తికరంగా మార్చింది. ఈ గొడవ నేపథ్యంలోనే నవీన్ ఉల్ హక్.. ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా మ్యాచ్‌ను చూస్తున్నాడు.
ముంబైతో మ్యాచ్‌లో కోహ్లీ(1), అనూజ్ రావత్(6) ఔటైనా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసకర హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్‌సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.