ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), రజత్ పటీదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దేవదత్ పడిక్కల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), జితేశ్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/45),ట్రెంట్ బౌల్ట్(2/57) రెండేసి వికెట్లు తీయగా.. విజ్ఞేష్ పుతుర్‌కు ఓ వికెట్ దక్కింది. జస్‌ప్రీత్ బుమ్రా(0/29) పొదుపైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ భారీ స్కోర్‌ను అడ్డుకున్నాడు.

కోహ్లీ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ తొలి బంతినే బౌండరీగా తరలించాడు. కోహ్లీ కూడా బౌండరీలతో విరుచుకుపడటంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. బుమ్రా బౌలింగ్‌లో ఓవర్ డీప్ మిడ్ వికెట్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
అనంతరం స్పిన్నర్లు రావడంతో ఈ జోడీ దూకుడు తగ్గింది. విజ్ఞేష్ పుతుర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో విరాట్ కోహ్లీ సిక్స్ బాది 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి పడిక్కల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
చెలరేగిన పటీదార్
మిచెల్ సాంట్నర్, బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సీబీ పరుగుల వేగం తగ్గింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ బాది టచ్‌లోకి వచ్చిన పటీదార్.. సాంట్నర్‌పై విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాది 20 పరుగులు పిండుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లీ, లివింగ్ స్టోన్(0) వెనుదిరిగినా.. జితేశ్ శర్మతో కలిసి చెలరేగాడు. జితేశ్ శర్మ సైతం భారీ షాట్లు కొట్టడంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది.
హార్దిక్ పాండ్యా వేసిన 17వ ఓవర్‌లో రజత్ పటీదార్ వరుసగా 6, 6, 4 కొట్టగా.. జితేష్ శర్మ బౌండరీ బాదాడు. దాంతో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రజత్ పటీదార్ 25 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ.. బౌల్ట్ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి ఓవర్‌లో బుమ్రా ఒకే ఒక్క సిక్స్ ఇవ్వడంతో ఆర్‌సీబీ 221 పరుగులు చేయగలిగింది.