ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా(4/45) అద్భుత బౌలింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో వాంఖడేలో ఆర్‌సీబీ 10 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), రజత్ పటీదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దేవదత్ పడిక్కల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), జితేశ్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/45),ట్రెంట్ బౌల్ట్(2/57) రెండేసి వికెట్లు తీయగా.. విజ్ఞేష్ పుతుర్‌కు ఓ వికెట్ దక్కింది. జస్‌ప్రీత్ బుమ్రా(0/29)పొదుపుగా బౌలింగ్ చేశాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్(2/46), జోష్ హజెల్ వుడ్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆఖరి ఓవర్‌లోనే కృనాల్ పాండ్యా 4 వికెట్లు తీయడం గమనార్హం. కీలక సమయంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఔటవ్వడం ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించింది.
నిరాశపర్చిన రోహిత్ శర్మ
భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ(17).. యశ్ దయాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(17)ను హజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. విల్ జాక్స్(28) సాయంతో సూర్యకుమార్ యాదవ్(28) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై 2 వికెట్లకు 54 పరుగులు చేసేంది. విల్ జాక్స్(22)ను కృనాల్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి 41 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను ఆర్‌సీబీ బౌలర్లు నేలపాలు చేశారు. భారీ షాట్లు ఆడేందుకు తెగ ఇబ్బంది పడిన సూర్య.. యశ్ దయాల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ముంబై ఇండియన్స్ 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. భారీ సిక్సర్లతో ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో ముంబై స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. ఈ క్రమంలో తిలక్ వర్మ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భువనేశ్వర్ కుమార్ విడదీసాడు. తిలక్ వర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 19వ ఓవర్‌లో హజెల్ వుడ్.. హార్దిక్ పాండ్యాను ఔట్ చేసి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. కృనాల్ పాండ్యా తొలి రెండు బంతులకు మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్‌లను పెవిలియన్ చేర్చాడు. నాలుగో బంతిని నమన్ ధిర్ బౌండరీ తరలించడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ అతన్ని కృనాల్ పాండ్యా ఔట్ చేయడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.
విరాట్ కోహ్లీ విధ్వంసం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ తొలి బంతినే బౌండరీగా తరలించాడు. కోహ్లీ కూడా బౌండరీలతో విరుచుకుపడటంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. బుమ్రా బౌలింగ్‌లో ఓవర్ డీప్ మిడ్ వికెట్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం స్పిన్నర్లు రావడంతో ఈ జోడీ దూకుడు తగ్గింది. విజ్ఞేష్ పుతుర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో విరాట్ కోహ్లీ సిక్స్ బాది 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి పడిక్కల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
గేమ్ ఛేంజింగ్ మూమెంటమ్..
మిచెల్ సాంట్నర్, బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సీబీ పరుగుల వేగం తగ్గింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ బాది టచ్‌లోకి వచ్చిన పటీదార్.. సాంట్నర్‌పై విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాది 20 పరుగులు పిండుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లీ, లివింగ్ స్టోన్(0) వెనుదిరిగినా.. జితేశ్ శర్మతో కలిసి చెలరేగాడు. జితేశ్ శర్మ సైతం భారీ షాట్లు కొట్టడంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. హార్దిక్ పాండ్యా వేసిన 17వ ఓవర్‌లో రజత్ పటీదార్ వరుసగా 6, 6, 4 కొట్టగా.. జితేష్ శర్మ బౌండరీ బాదాడు.
దాంతో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రజత్ పటీదార్ 25 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ.. బౌల్ట్ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి ఓవర్‌లో బుమ్రా ఒకే ఒక్క సిక్స్ ఇవ్వడంతో ఆర్‌సీబీ 221 పరుగులు చేయగలిగింది. జితేశ్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ భారీ లక్ష్యం నమోదైంది. జితేశ్ శర్మ బ్యాటింగే ఈ మ్యాచ్‌కు గేమ్ ఛేంజింగ్ మూమెంటమ్‌గా నిలిచింది.