ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ.. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా(5/21) సంచలన బౌలింగ్‌తో నిప్పులు చెరిగినా.. దినేశ్ కార్తీక్ విధ్వంకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది.
ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రజత్ పటీదార్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ముంబై బౌలర్లలో బుమ్రాకు తోడుగా గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మూడో ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ(0)ని బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. విల్ జాక్స్(8)ను ఆకాశ్ మధ్వాల్ ఔట్ చేశాడు. దాంతో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్‌తో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ 2 వికెట్లకు 44 పరుగులే చేసింది.
చెలరేగిన పటీదార్, డుప్లెసిస్..
అనంతరం దూకుడు పెంచిన ఈ జోడీ భారీ షాట్లతో వేగంగా పరుగులు చేసింది. ముఖ్యంగా రజత్ పటీదార్ ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో చెలరేగాడు. దాంతో ఆర్‌సీబీ 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 89 పరుగులు చేసింది. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రజత్ పటీదార్‌ను గెరాల్డ్ కోయిట్జీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్(0) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్ సాయంతో ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దెబ్బతీసిన బుమ్రా..
ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ ఒకే తరహా ఇన్నోవేటివ్ షాట్స్‌తో నాలుగు బౌండరీలు బాదాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఫాఫ్ డుప్లెసిస్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరసటి బంతికే స్టన్నింగ్ యార్కర్‌తో మహిపాల్ లోమ్రోర్(0)ను డకౌట్ చేసిన బుమ్రా.. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసాడు.
దినేశ్ కార్తీక్ విధ్వంసం..
కోయిట్జీ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ సిక్స్ బాదగా.. 19వ ఓవర్ వేసిన బుమ్రా వరుస బంతుల్లో సౌరవ్ చౌహాన్(9), విజయ్ కుమార్ వైశాఖ్(0)లను ఔట్ చేసి ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసాడు. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్.. ఆకాశ్ మధ్వాల్ వేసిన చివరి ఓవర్‌లో కార్తీక్ 6, 6, 4 బాది జట్టుకు 196 పరుగుల భారీ స్కోర్ అందించాడు.