ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. నేడు(శనివారం) రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో సొంతమైదానంలో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న రోహిత్.. అదే ఉత్సాహాన్ని కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు వరుస ఓటములతో చతికిలపడ్డ పంజాబ్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
బ్యాటింగ్, బౌలింగ్‌లో గాడిన పడిన ముంబై ఇండియన్స్ జోరు మీద ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లోకి రాగా.. సూర్యకుమార్ యాదవ్ గాడిన పడాల్సి ఉంది. వరుసగా విఫలమైన కామెరూన్ గ్రీన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తిలక్ వర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టీమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, నెహా వదేరాలతో లోయరార్డర్ కూడా పటిష్టంగా ఉంది.

బౌలింగ్ విభాగంలో జాసన్ బెహండార్ఫ్, పియూష్ చావ్లా, హృతిక్ షోకీన్‌లో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకుంటే రిలే మెరిడిత్ స్థానంలో బరిలోకి దిగుతాడు. మెరిడిత్‌తో పాటు కుమార్ కార్తికేయ ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగనున్నాడు.
మరోవైపు శిఖర్ ధావన్ సేవలను కోల్పోయిన పంజాబ్ కింగ్స్ బలహీనంగా మారింది. ధావన్ గైర్హాజరీలతో సామ్ కరణ్ జట్టును నడిపించనున్నాడు. సికిందర్ రాజా, కగిసో రబడా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనుండగా.. మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్‌లపై వేటు వేయనున్నారు. లియామ్ లివింగ్ స్టోన్ ఫామ్‌లోకి వస్తే పంజాబ్‌కు తిరుగుండదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ సునాయస విజయం సాధించేలా కనిపిస్తోంది. సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుండటం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే అంశం.
తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నెహాల్ వాదేరా, జోఫ్రా ఆర్చర్/రిలే మెరిడిత్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్
పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రాజా, జితేశ్ శర్మ(కీపర్), షారూఖ్ ఖాన్, సామ్ కరణ్(కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడా/నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్