
అబుదాబి: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కోసం మొదటగా అప్పీల్ చేసిన కృనాల్.. అది క్రీడా స్పూర్తికి విరుద్దమని గ్రహించి తన అభ్యర్థనను వెనక్కు తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కృనాల్ నిర్ణయాన్ని సమర్థించడంతో అంపైర్ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అసలేం జరిగిందంటే.. పంజాబ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతిని కృనాల్ యార్కర్ లెంగ్త్‌గా సంధించగా.. స్ట్రైకింగ్‌లో ఉన్న యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ స్ట్రైట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే నాన్ స్ట్రైకర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ తాకి బంతి దూరంగా వెళ్లింది.
ఇక బంతిని అందుకున్న కృనాల్.. వికెట్లకు నేరుగా హిట్ చేసి అప్పీల్ చేశాడు. అయితే అప్పటికే కేఎల్ రాహుల్ లోపల ఉండటం.. అతను పరుగు కోసం ప్రయత్నించలేకపోవడంతో కృనాల్ తన నిర్ణయాన్ని వెనక్క తీసుకున్నాడు. ఔట్ అంపైర్ అని అరిచిన అతను.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరుతుండగా వద్దు వద్దూ అని తన అభ్యర్థనను వెనక్కు తీసుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ సైతం కృనాల్ అప్పీల్‌కు బిత్తరపోయి ఏందీరా? ఇది? అన్నట్లు చూశాడు. కానీ అతను తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో థంప్సప్ సింబల్‌తో సైగ చేశాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అప్పీల్ వద్దని సైగలు చేస్తూ కృనాల్ నిర్ణయాన్ని సమర్థించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కృనాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అభిమానులు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రీడా స్పూర్తి అంటే ఇదే బ్రదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(21), మన్‌దీప్ సింగ్(15), క్రిస్ గేల్(1), నికోల్స్ పూరన్(2) తీవ్రంగా నిరాశపరిచారు. మన్‌దీప్ సింగ్‌ను కృనాల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. గేల్, రాహుల్‌ను ఓకే ఓవర్‌లో పొలార్డ్ పెవిలియన్ చేర్చి టీ20 క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. నికోలసన్ పూరన్‌ను బుమ్రా ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ స్థానంలో సౌరభ్ తివారీ జట్టులోకి రాగా.. ఆడమ్ మిల్నే ప్లేస్‌లో నాథన్ కౌల్టర్ నైల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ పక్కనపెట్టడానికి గల కారణాన్ని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ వెల్లడించాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఇషాన్‌ను పక్కనపెట్టామని, అంతకు మించిన కారణం ఏం లేదని పేర్కొన్నాడు. ఇక తమ టీమ్ ఏ పరిస్థితుల్లో ఉందో తమకు బాగా తెలుసన్నాడు. తమ సామర్థ్యానికి తగిన ప్రదర్శన చేయలేదనేది కూడా వాస్తవేమనని, ఇది జట్టులోని ప్రతీ ఆటగాడికి అర్థమవుతుందన్నాడు. తాము కొన్ని తప్పిదాలు చేశామని అవి ఈ మ్యాచ్‌లో సరిదిద్దుకుంటామని చెప్పాడు. ఈ క్రమంలోనే తుది జట్టు విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని రోహిత్ చెప్పుకొచ్చాడు.