
అబుదాబి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు దుమ్ములేపారు. సమష్టిగా రాణించి పంజాబ్ కింగ్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(42), దీపక్ హుడా(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా చెరొక వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మన్‌దీప్ సింగ్(15) తీవ్రంగా నిరాశపరిచాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(1), కేఎల్ రాహుల్(21)లను పొలార్డ్ ఔట్ చేశాడు. ఈ ఇద్దరిని క్యాచ్ ఔట్లుగా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే నికోలస్ పూర్‌న్(2)ను వికెట్ల ముందు బుమ్రా బోల్తా కొట్టించాడు.
దాంతో పంజాబ్ కింగ్స్ 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్కరమ్(42), దీపక్ హుడా(28) పంజాబ్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 61 పరుగులను జోడించారు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన మార్క్‌రమ్‌ను చాహర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత దీపక్ హుడా కూడా ఔటవ్వడంతో పంజాబ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.