ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్‌కు తోడుగా ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది. నువాన్ తుషారా(3/42) ధాటికి 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కేకేఆర్‌ను వెంకటేశ్ అయ్యర్, మనీష్ పాండే ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించారు.

నిప్పులు చెరిగిన తుషారా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నువాన్ తుషారా(3/25) ధాటికి కోల‌్‌కతా నైట్‌రైడర్స్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫిల్ సాల్ట్(5), రఘువంశీ(13), శ్రేయస్ అయ్యర్(6)లను నువాన్ తుషారా పెవిలియన్ చేర్చగా.. సునీల్ నరైన్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్ ఆచితూచి ఆడి పవర్ ప్లేను ముగించారు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. పియూష్ చావ్లా తొలి బంతికే రింకూ సింగ్‌ను ఔట్ చేసాడు. దాంతో కేకేఆర్.. మనీష్ పాండేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపింది.
వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి మనీష్ పాండే ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీష్ పాండే సైతం హాఫ్ సెంచరీ దిశగా సాగగా.. అతన్ని హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో 6వ వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రస్సెల్(7) రనౌట్ కాగా.. రమణ్‌దీప్ సింగ్(2), మిచెల్ స్టార్క్(0)లను బుమ్రా ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. నువాన్ తుషారా వేసిన 19వ ఓవర్‌లో 6, 4 బాదిన వెంకటేష్ 12 పరుగులు పిండుకున్నాడు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ కావడంతో కేకేఆర్ 169 పరుగులకే పరిమితమైంది.