ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్‌తో 170 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ చేధించ లేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో రెండు వికెట్లు తీసారు.
ఇది ముంబై ఇండియన్స్ 8వ పరాజయం. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు.
నిరాశపర్చిన రోహిత్..
170 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే నమన్ ధీర్(11)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయగా.. రోహిత్ శర్మ(11)సునీల్ నరైన్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 46 పరుగులే చేసింది.
సూర్య ఒంటరి పోరాటం..
క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు తిలక్ వర్మ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ తిలక్ వర్మను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చగా.. ఆ కొద్ది సేపటికే నెహాల్ వధేరా(6)ను నరైన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా(1)ను ఆండ్రీ రస్సెల్ క్యాచ్ ఔట్ చేయడంతో ముంబై ఇండియన్స్ 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో టీమ్ డేవిడ్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో అతను 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో రస్సెల్ బౌలింగ్‌లో సూర్య క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
దాంతో మ్యాచ్‌పై కేకేఆర్ పట్టు సాధించింది. టీమ్ డేవిడ్(24) పోరాడే ప్రయత్నం చేసినా అతన్ని మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పియూష్ చావ్లా గోల్డెన్ డక్ అవ్వగా.. రెండు బంతుల వ్యవధిలోనే ఆఖరి వికెట్‌గా కోయిట్జీ బౌల్డ్ అవ్వడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది.