ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) వెటరన్ ప్లేయర్ మనీష్ పాండే ఎట్టకేలకు అవకాశం అందుకున్నాడు. అవకాశం కోసం గత 9 మ్యాచ్‌లుగా నిరీక్షించిన మనీష్ పాండేకు ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అవకాశం దక్కింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన మనీష్ పాండే వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందింపుచుకున్నాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడ్డ కేకేఆర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన మనీష్ పాండే ఆదుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్‌తో 6వ వికెట్‌కు 83 పరుగులు జోడించి కేకేఆర్‌కు 170 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. తీవ్ర ఒత్తిడిలో 31 బంతులు ఆడి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేసాడు.

ఇక యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మనీష్ పాండే కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బుమ్రా బౌన్సర్‌గా సంధించగా.. మనీష్ పాండే స్మార్ట్‌గా అప్పర్ కట్‌తో థర్డ్ మ్యాన్ దిశగా సిక్సర్ రాబట్టాడు. ఈ షాట్‌ను చూసి బుమ్రా బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక మనీష్ పాండే బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతని బ్యాటింగ్‌ను కొనియాడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఉద్దేశం ఏంటో మనీష్ పాండే తన బ్యాటింగ్ ద్వారా తెలియజేసాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ వ్యూహాలకు తిరుగు లేదని, మనీష్ పాండేను కొనుగోలు చేయడంతో పాటు సరైన సమయంలో బ్యాటింగ్‌కు పంపించి ఫలితాన్ని రాబట్టాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచి 2012, 2014 సీజన్లలో మనీష్ పాండే కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.