ముంబై: గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. ముందుగా బౌలింగ్‌లో(4/30) నాలుగు వికెట్లు పడగొట్టిన రషీద్.. అనంతర బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసాడు.
219 పరుగుల భారీ లక్ష్యచేధనలో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకోని విఫలమవ్వగా.. రషీద్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు పరువును కాపాడాడు. 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగుతున్న గుజరాత్ ఇన్నింగ్స్‌కు రషీద్ ఖాన్ ఊపిరి అందించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రషీద్ ఖాన్.. మొత్తం 10 సిక్సర్లతో వీర విహారం చేశాడు.

అల్జారీ జోసెఫ్‌తో కలిసి 9వ వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. రషీద్ ఖాన్ సూపర్ బ్యాటింగ్‌కు ముంబై ఇండియన్స్ బౌలర్లు వణికిపోయారు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌కు మరో బ్యాటర్ అండగా నిలిచి ఉంటే ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఈజీగా గెలిచేది.
సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యతో పాటు రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. రషీద్ ఖాన్‌కు తోడుగా డేవిడ్ మిల్లర్(41)రాణించాడు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్(3/31) మూడు వికెట్లు తీయగా.. పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ తలో రెండు వికెట్లు తీసారు.