ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 6 విజయాల తర్వాత గెలిచే మ్యాచ్‌లో ఓడింది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనేక మలుపులు తిరుగుతూ.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 15 పరుగుల అవసరమవ్వగా.. గెరాల్డ్ కోయిట్జీ, రాహుల్ తెవాటియా విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. దీపక్ చాహర్ పేలవ బౌలింగ్ ముంబై ఇండియన్స్ కొంపముంచింది. ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ముంబై మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

విల్ జాక్స్ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. విల్ జాక్స్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53), సూర్యకుమార్ యాదవ్(24 బంతుల్లో 5 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43), జోస్ బట్లర్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్ రెండేసి వికెట్లు తీసారు. జస్‌ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్‌తో విజయం ముంగిట నిలిచిన ముంబై ఇండియన్స్.. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులను కట్టడి చేయలేక ఓటమికి తల వంచింది.
నిరాశపర్చిన సాయి..
156 పరుగుల లక్ష్యచేధనలో గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే సాయి సుదర్శన్(5)ను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. జోస్ బట్లర్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే అనంతరం దూకుడుగా ఆడిన ఈ జోడీ.. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యాపై విరుచుపడింది. హార్దిక్ వేసిన 8వ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. అశ్వని కుమార్ వేసిన 12వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను తిలక్ వర్మ నేలపాలు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే బట్లర్‌ను అశ్వని కుమార్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
విల్ జాక్స్ వేసిన 13వ ఓవర్‌లో రూథర్ ఫోర్డ్ వరుసగా రెండు బౌండరీలతో పాటు సిక్స్ కొట్టి 15 పరుగులు పిండుకున్నాడు. అశ్వని కుమార్ వేసిన 14వ ఓవర్‌లో మరో సిక్స్ కొట్టడంతో గుజరాత్ 107 పరుగులకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

మలుపు తిప్పిన బుమ్రా..
ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వగా.. బుమ్రా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ బౌండరీ బాది.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లో డేంజరస్ రూథర్‌ఫోర్డ్‌ను బౌల్ట్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. బుమ్రా తన మరుసటి ఓవర్‌లో షారుఖ్ ఖాన్ ఔట్ చేయగా.. రషీద్ ఖాన్(2)ను అశ్వని కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఈ ఓవర్ ఆఖరి బంతికి కోయిట్జీ బౌండరీ బాదడంతో ఆఖరి 2 ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి.
ఆడుకున్న వరణుడు..
ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షం మ్యాచ్ అంతరాయం కలిగించింది. కాసేపటి తర్వాత ఆటతిరిగి ప్రారంభమవ్వగా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఒక ఓవర్‌ను కుదించారు. దాంతో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. ముంబై స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ బయట నలుగురి ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు. దీపక్ చాహర్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతిని రాహుల్ తెవాటియా బౌండరీ బాదడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
రెండో బంతిని కోయిట్జీ సిక్సర్ బాది, సింగిల్ తీయడంతో పాటు అది నోబాల్ కావడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మళ్లింది. ఐదో బంతికి కోయిట్జీ ఔటవ్వడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆఖరి బంతికి అర్షద్ ఖాన్ సింగిల్ తీయగా.. గుజరాత్ విజయం లాంఛనమైంది. రనౌట్ చేసే అవకాశాన్ని హార్దిక్ పాండ్యా చేజార్చాడు.