ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. రవీంద్ర జడేజా(3/20) మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(21 బంతుల్లో 5 ఫోర్లతో 32), టీమ్ డేవిడ్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 21), ఇషాన్ కిషన్ ధాటిగానే ఆరంభించారు. రోహిత్ తన ట్రేడ్ మార్క్ సిక్స్‌తో అలరించగా.. ఇషాన్ కిషన్ బౌండరీలతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ తుషార్ దేశ్‌పాండే సూపర్ డెలివరీతో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు.దాంతో ముంబై 38 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి కామెరూన్ గ్రీన్(12) రాగా.. ఇషాన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఆ వెంటనే ధోనీ జడేజాను రంగంలోకి దించి ఫలితం రాబట్టాడు.

ఇషాన్ కిషన్‌ను జడేజా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. సూర్యకుమార్ యాదవ్(1)ను మిచెల్ సాంట్నర్ కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. అంపైర్ ఔటివ్వకపోయినా.. ధోనీ రివ్యూతో ఫలితం రాబట్టాడు.ఆ మరుసటి ఓవర్‌లోనే గ్రీన్‌ను జడేజా రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్(2)ను సాంట్నర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. బౌండరీలతో జోరు కనబర్చిన తెలుగు తేజం తిలక్ వర్మ(22)ను జడేజా ఎల్బీగా ఔట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్‌ను కళ్లు చెదిరే క్యాచ్ సాయంతో మగాల పెవిలియన్ చేర్చాడు. టీమ్ డేవిడ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. దేశ్ పాండే అతనికి అడ్డుకట్ట వేసాడు. హృతిక్ షోకీన్ మూడు బౌండరీలు బాదడంతో ముంబై 150 పరుగుల మార్క్‌ను ధాటింది.