చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ బౌండరీ లైన్ వద్ద సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముస్తాఫిజుర్ సెన్సేషనల్ క్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు.
సిక్సర్‌గా వెళ్లాల్సిన బంతిని ముస్తాఫిజుర్ తెలివిగా అందుకొని వికెట్‌గా మార్చాడు. మతీష పతీరణ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని పతీరణ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ లెంగ్త్‌లో వేయగా.. సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్‌తో థర్డ్ మ్యాన్ ఫీల్డర్ వైపు ఆడాడు.

ఆ దిశలోనే ఫీల్డింగ్ చేస్తున్న ముస్తాఫిజుర్ కాస్త ఎడమవైపు జరిగి బౌండరీ లైన్‌పై బంతిని అద్భుతంగా అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను సమయస్పూర్తితో బంతిని గాల్లోకి విసిరేసి తిరిగొచ్చి అందుకున్నాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు.