MI vs CSK match 1: రఫ్ఫాడించిన రాయుడు, డూప్లెసిస్.. శుభారంభం చేసిన సీఎస్‌కే!

అబుదాబి: అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ తొలి రోజే అందించింది. ఫ్యాన్స్ సందడి లేకపోయినా.. చీర్ గాళ్స్ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. అదిరే సిక్స్‌లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫస్ట్ మ్యాచ్‌లోనే అభిమానులకు పసందైన విందు లభించింది. కరోనా కొరల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరైన చెన్నై సూపర్ కింగ్స్.. అద్భుత ఆట తీరుతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి శుభారంభాన్ని అందుకుంది.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71) సూపర్ బ్యాటింగ్‌కు ఫాఫ్ డూప్లెసిస్( 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో 5 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు 162 పరుగులు చేసింది. ఆ జట్టులో సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జేడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ కరన్ చెరొక వికెట్ లభించింది. అనంతరం చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, పాండ్యా, చాహర్, బుమ్రా తలో వికెట్ తీశారు.

ఆదిలోనే గట్టి షాక్..
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నైకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికే ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ (4)వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం పాటిన్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్ ఆఖరి బంతికి మురళీ విజయ్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే టీవీ రీప్లేలో బంతి వికెట్‌కు తాకలేదని స్పష్టమైంది. నాన్ స్ట్రైకర్‌గా ఉన్న ఫాఫ్ డూప్లెసిస్ రివ్యూ తీసుకోవాలని సూచించినా విజయ్ పట్టించుకోలేదు.

రాయుడు సూపర్ ఫిఫ్టీ..
ఇక 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సీఎస్‌కేను తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, ఫాఫ్ డూప్లెసిస్ గట్టెక్కించారు. ప్రారంభంలో మొత్తం డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ..నిదానంగా స్కోరు బోర్డు వేగం పెంచింది. బుమ్రా వేసిన నోబాల్‌ను ఫోర్ కొట్టిన రాయుడు.. ఫ్రీహిట్‌ను సిక్స్ కొట్టి గాడిలో పడ్డాడు. అనంతరం రాహుల్ చాహర్ వేసిన 10వ ఓవర్ 3, 4 బంతులను వరుసగా బౌండరీలకు తరలించాడు. తర్వాత కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన రాయుడు.. బుమ్రా వేసిన 12 ఓవర్ 5వ బంతిని స్ట్రైట్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

డూప్లెసిస్ సూపర్ ఫీఫ్టీ..
హాఫ్ సెంచరీ తర్వాత మరింత ధాటిగా ఆడిన రాయుడు.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రిట్నర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం జడేజా(10) విఫలమవ్వగా.. సామ్ కరన్(6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 18)మెరుపులు మెరిపించాడు. ఓవైపు వికెట్లు పోతున్న మరోవైపు ఫాఫ్ డూప్లెసిస్ హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక క్రీజులోకి వచ్చి ధోనీ(0) మాత్రం పరుగుల ఖాతా తెరవలేదు. ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా డూప్లెసిస్ పట్టిన సూపర్ క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.

ముంబై కొంప ముంచిన చెత్త ఫీల్డింగ్..
ఇక ముంబై ఇండియన్స్ చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అంబటి రాయుడు ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను రాహుల్ చాహర్ విడిచి పెట్టాడు. పరుగులను కట్టడి చేసే విషయంలో కూడా ముంబై ఆటగాళ్లు తడబడ్డారు. కెప్టెన్ రోహిత్ నుంచి అందరూ సమష్టిగా విఫలమయ్యారు. మంచు ప్రభావం కూడా వారికి ప్రతికూలంగా మారింది. పదేపదే మిస్ ఫీల్డ్ చేశారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకొని ఓ వికెట్ మాత్రమే తీశాడు. మొత్తానికి ముంబై తమ ఫస్ట్ మ్యాచ్ ఓటమి సెంటిమెంట్‌ను రిపీట్ చేసింది. ఆ జట్టు గత ఏడుసీజన్లలో తొలి మ్యాచ్ గెలవలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications