
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే తనకు స్పూర్తని యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక క్రికెటే తన ఊపిరని అభివర్ణించిన ఈ ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్.. క్రికెటర్ కాకపోయుంటే నటుడిగా రాణించేవాడినని చెప్పాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన సూర్య.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చాడు.

క్రికెట్‌లో తనకిష్టమైన షాట్ స్వీప్‌షాట్ అని చెప్పిన సూర్య.. అభిమానుల కోరిక మేరకు టీమిండియా దిగ్గజ క్రికెటర్లపైనా వన్ వర్డ్‌లో తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మాజీ సారథులు మహేంద్రసింగ్ ధోనీ, సచిన్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు. కోహ్లీ స్ఫూర్తిదాయకమైన ఆటగాడని, రోహిత్ హిట్‌మ్యాన్ అని పేర్కొన్నాడు. అలాగే ధోనీ దిగ్గజం అని కీర్తించాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెందూల్కర్‌ను దేవుడితో పోల్చాడు. కాగా, క్రికెట్‌లో సచిన్‌ను 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా అభిమానులు భావిస్తారనే సంగతి తెలిసిందే.

అలాగే ముంబై ఇండియన్స్ తన కుటుంబంలాంటిదని చెప్పిన సూర్య.. బిర్యాని తనకిష్టమైన ఆహారమన్నాడు. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఇష్టమైన నటుడని.. ఒకవేళ తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంపికచేసుకోకపోతే నటనపై దృష్టిపెట్టేవాడినని తెలిపాడు. 2019, 20 ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించడం తనకెంతో ఇష్టమైన సందర్భాలని గుర్తుచేసుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యపై స్పందిస్తూ.. అతడో ఎంటర్‌టైనర్ అని సూర్యకుమార్ పొగిడాడు. తన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏది అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ చేసిన ఫొటోను పోస్టు పంచుకున్నాడు.
ఇక సూర్య చెప్పిన సమాధానాలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్య, కోహ్లీ మధ్య మైదానంలో సైలెంట్ వార్ నడిచిన నేపథ్యంలో విరాట్ తన స్పూర్తిదాయకమైన ఆటగాడని అతను పేర్కొనడం అభిమానులను విస్మయపరిచింది.