ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. అంతేకాకుండా అదే రోజు (అక్టోబర్ 31(గురువారం)) సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా.. రిటెన్షన్ జాబితాలను అధికారికంగా ప్రకటించనున్నాయి.
మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది. ఈ ఆరుగురి ఆటగాళ్లను నేరుగా లేదా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌తో తిరిగి కొనుగోలు చేయవచ్చు. నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలోకి వదిలేసే ముఖ్యమైన ఆటగాళ్లతో చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
వేలంలోకి వదిలేసామనే దిగులు చెందవద్దని, ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగోలు చేస్తామనే భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం. మోస్ట్ సక్సెఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ ఆరుగురు ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు తిలక్ వర్మ, నెహాల్ వదేరాలను రిటైన్ చేసుకునేందుకు సిద్దమైనట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
రోహిత్ శర్మ జట్టు వీడుతాడని ప్రచారం జరిగినా.. అతన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలను రూ. 18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకున్నట్లు సమాచారం. తిలక్ వర్మకు రూ. 11 కోట్లు, అనామక ప్లేయర్ అయిన నెహాల్ వదేరాను రూ. 4 కోట్లకు అంటిపెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను వేలంలోకి వదిలేసేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ. 15.25 కోట్ల భారీ ధరకు ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ప్రధాన వికెట్ కీపర్‌గా అతన్ని జట్టులో కొనసాగించింది. కానీ రిటెన్షన్ రూల్స్ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌ను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.