ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే టోర్నీలో ముందడుగు వేయనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. ఈ క్రమంలోనే టీమ్ తప్పిదాలను సరిదిద్దుకోవడంపై హార్దిక్ సేన ఫోకస్ పెట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ స్వదేశం వెళ్లిపోగా.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ వెటరన్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోను తీసుకుంది.

రోహిత్‌కు జతగా బెయిర్ స్టో..
రోహిత్ శర్మతో కలిసి బెయిర్ స్టో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అతని ఐపీఎల్ అనుభవం ముంబైకి కలిసిరానుంది. మరోవైపు ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. కనీసం కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లోనైనా అతను రాణించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ అదిరిపోయే ఆరంభం అందిస్తే ముంబై భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ సాంట్నర్‌తో పాటు చరిత్ అసలంక, బెవాన్ జకోబ్స్‌లో ఒకరు ఆడనున్నారు.
చరిత్ అసలంకకు చోటు..?
సూర్య సూపర్ ఫామ్‌లో ఉండగా.. తిలక్ వర్మ తన బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్ పర్వాలేదనిపిస్తున్నారు. చరిత్ అసలంక, బెవన్ జాకోబ్స్‌లో ఒకర్ని ఆడించనున్నారు. పేస్ బాధ్యతలను జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ పంచుకోనున్నాడు. ఈ ముగ్గురికి అండగా హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయనున్నాడు. బుమ్రా బౌలింగ్ కీలకం కానుంది.
గుజరాత్‌పై గెలవని ముంబై..
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లకు రెండింటిని ముంబై ఓడిపోయింది. వాంఖడే వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలుపు ముంగిట ముంబై చేతులెత్తేసింది. ఈ ఓటమి ఆ జట్టు టాప్-2 అవకాశాలను దెబ్బతీసింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్‌లకు నాలుగింటిలోనూ ముంబై విజయం సాధించలేదు. మొత్తం ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా ముంబై రెండు మాత్రమే గెలిచింది. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఈ రికార్డ్‌ను సరిచేసుకోవాలని ముంబై భావిస్తోంది.
ముంబై తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ సాంట్నర్, చరిత్ అసలంక/బెవాన్ జకోబ్స్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్.